Secunderabad-Kazipet Railway Line: తెలంగాణలో మరో రెండు కొత్త రైల్వే లైన్లు.. రూ.2,837 కోట్లతో భారీ ప్రాజెక్టు

Telangana to get two new railway lines Secunderabad Kazipet route
  • సికింద్రాబాద్-కాజీపేట మధ్య రెండు కొత్త రైల్వే లైన్లు
  • ప్రయాణ సమయంలో గంట వరకు ఆదా అయ్యే అవకాశం
  • గంటకు 150 కి.మీ వేగంతో పరుగులు పెట్టనున్న రైళ్లు
  • రైల్వే రద్దీని తగ్గించి, సరుకు రవాణాను వేగవంతం చేసే లక్ష్యం
తెలంగాణలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటైన సికింద్రాబాద్-కాజీపేట సెక్షన్‌లో ప్రయాణికులకు శుభవార్త. ఈ మార్గంలో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతమున్న లైన్లకు అదనంగా మరో రెండు రైల్వే లైన్లను నిర్మించాలని నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా కీలక ప్రకటన చేశారు. మొత్తం 110 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ అదనపు లైన్ల కోసం సుమారు రూ. 2,837 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వే ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, రైళ్ల వేగాన్ని పెంచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే సికింద్రాబాద్-కాజీపేట మధ్య ప్రయాణానికి ప్రస్తుతం పడుతున్న రెండున్నర నుంచి మూడు గంటల సమయం గంట వరకు తగ్గనుంది. అంటే, రెండు గంటల్లోపే గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అదనపు లైన్ల నిర్మాణంతో రైళ్ల వేగాన్ని గంటకు 130 నుంచి 150 కిలోమీటర్లకు పెంచేందుకు వీలు కలుగుతుంది.

సికింద్రాబాద్-కాజీపేట మార్గం కేవలం తెలంగాణకే కాకుండా, ఉత్తర-దక్షిణ, తూర్పు భారత దేశ ప్రాంతాలను కలిపే కీలకమైన కారిడార్‌గా ఉంది. ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లతో పాటు గూడ్స్ రైళ్ల రాకపోకలు కూడా అధికంగా ఉంటాయి. కొత్త లైన్ల నిర్మాణంతో రైళ్ల ఆలస్యం తగ్గి, మరిన్ని రైళ్లను నడిపేందుకు వీలవుతుంది. ముఖ్యంగా గూడ్స్ రైళ్ల సేవలు మెరుగుపడి, సరుకు రవాణా వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ప్రస్తుతం తుది ఆమోదం కోసం ఎదురుచూస్తోందని, అనుమతులు లభించగానే పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
Secunderabad-Kazipet Railway Line
G Kishan Reddy
Telangana railways
new railway lines
railway project
Indian Railways
railway infrastructure
railway traffic
goods train services
railway development

More Telugu News