AP Disaster Management: నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

AP Disaster Management Warns of Rains in Several AP Districts
  • సముద్ర మట్టానికి సగటున 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం
  • నేడు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పిడుగలతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ 
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా శనివారం (11వ తేదీ) ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

శుక్రవారం సాయంత్రం వరకు నమోదైన వర్షపాతం వివరాలను కూడా ఆయన తెలియజేశారు. కోనసీమ జిల్లా నగరంలో 46 మిమీ, మలికిపురంలో 36.2 మిమీ, ప్రకాశం జిల్లా నర్సింగోలులో 27 మిమీ వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా డి.పోలవరంలో 25.5 మిమీ, కోనసీమ జిల్లా అంబాజీపేటలో 21.7 మిమీ వర్షపాతం నమోదైనట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. 
AP Disaster Management
Andhra Pradesh Rains
AP Weather Forecast
Uttarandhra
Alluri Sitarama Raju District
Visakhapatnam
Anakapalli
Krishna District
Thunderstorms

More Telugu News