Martlet Missile: అలుపెరగని పక్షి ‘మార్ట్‌లెట్’.. భారత సైన్యం అమ్ములపొదిలో బ్రిటన్ క్షిపణులు

Martlet Missile Indian Army Acquires UK Missiles
  • భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన రూ.4151 కోట్ల కీలక రక్షణ ఒప్పందం
  • సైన్యానికి అందనున్న 'మార్ట్‌లెట్' తేలికపాటి బహుళ ప్రయోజన క్షిపణులు
  • డ్రోన్లు, సాయుధ వాహనాలను కూడా నాశనం చేయగల సామర్థ్యం
  • భుజంపై నుంచి, వాహనాలు, హెలికాప్టర్ల నుంచి ప్రయోగించే వీలు
  • ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న క్షిపణులు
భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. బ్రిటన్ నుంచి అత్యాధునిక క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్ ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ.4151 కోట్ల విలువైన ఈ రక్షణ ఒప్పందం ద్వారా భారత సైన్యం అమ్ములపొదిలోకి శక్తివంతమైన ఆయుధాలు చేరనున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా, 'మార్ట్‌లెట్'గా పిలిచే తేలికపాటి బహుళ ప్రయోజన క్షిపణులను (LMM) భారత సైన్యం సమకూర్చుకోనుంది. పురాణాల్లో ప్రస్తావించే 'అలుపెరగని పక్షి' పేరును ఈ క్షిపణులకు పెట్టారు. ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో ఉన్న 'థేల్స్ ఎయిర్ డిఫెన్స్' అనే సంస్థ వీటిని అభివృద్ధి చేస్తోంది. ఈ క్షిపణులు బహుళ ప్రయోజనకరం కావడంతో గాలి నుంచి గాలిలోకి, గాలి నుంచి భూమిపైకి, అలాగే భూమి నుంచి ఇతర లక్ష్యాలపైకి కూడా దాడి చేయగలవు.

ఈ క్షిపణుల పనితీరు, వాటి సామర్థ్యం చాలా ప్రత్యేకం. లేజర్ బీమ్ గైడెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ క్షిపణులను సైనికులు తమ భుజంపై నుంచే సులువుగా ప్రయోగించవచ్చు. అంతేకాకుండా సాయుధ వాహనాలు, హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించే వీలుంది. కేవలం 13 కిలోల బరువుండే ఈ క్షిపణులు, శబ్ద వేగం కన్నా 1.5 రెట్లు వేగంతో ప్రయాణిస్తూ ఆరు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలవు. ముఖ్యంగా డ్రోన్లు, సాయుధ వాహనాలు, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.

2019 నుంచి బ్రిటన్ సైన్యం ఈ మార్ట్‌లెట్ క్షిపణులను వినియోగిస్తోంది. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు కూడా యూకే ఇదే తరహా క్షిపణులను సరఫరా చేసింది. అక్కడ ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తాజా ఒప్పందం భవిష్యత్తులో భారత్-యూకే మధ్య మరిన్ని విస్తృత ఆయుధ ఒప్పందాలకు మార్గం సుగమం చేస్తుందని బ్రిటన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో, యూకేలోని ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి రంగాల్లో 64 భారత కంపెనీలు రూ.15,430 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని, దీని ద్వారా దాదాపు 7,000 ఉద్యోగాలు లభిస్తాయని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.
Martlet Missile
Indian Army
UK
Britain
Thales Air Defence
Lightweight Multirole Missile
LMM
defence deal
India-UK relations
military technology

More Telugu News