Tennessee Factory Explosion: టెన్నెస్సీలో పెను విషాదం: ఆయుధ ఫ్యాక్టరీలో పేలుడు.. 19 మంది గల్లంతు!

Tennessee Ammunition Factory Explosion Leaves 19 Missing
  • ఘటనలో 19 మంది గల్లంతు, మరణించి ఉంటారని ఆందోళన
  • ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైందని తెలిపిన అధికారులు
  • మైళ్ల దూరం వినిపించిన శబ్దం, కంపించిన ఇళ్లు
  • పేలుడు కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు
  • ఇది తమ సమాజానికి పెద్ద విషాదమన్న స్థానిక మేయర్
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఒక సైనిక మందుగుండు సామగ్రి కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వారంతా మరణించి ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ విస్ఫోటనం ధాటికి ఫ్యాక్టరీ పూర్తిగా నామరూపాల్లేకుండా పోయింది.

నాష్‌విల్‌కు సుమారు 60 మైళ్ల దూరంలోని బక్స్‌నోర్ట్ పట్టణ సమీపంలో ఉన్న 'యాక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్' అనే కర్మాగారంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, మైళ్ల దూరంలోని ఇళ్లు సైతం కంపించిపోయాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రమాద స్థలాన్ని చూసిన హంఫ్రీస్ కౌంటీ పోలీస్ అధికారి క్రిస్ డేవిస్, "అక్కడ వర్ణించడానికి ఏమీ మిగల్లేదు. అంతా ధ్వంసమైపోయింది. నా కెరీర్‌లోనే ఇంతటి విధ్వంసకరమైన పరిస్థితిని చూడలేదు" అని తీవ్ర ఆవేదన వ్య‌క్తం చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నప్పటికీ, మరిన్ని పేలుళ్లు సంభవించే అవకాశం ఉండటంతో మొదట లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం, పేలుడు పదార్థాల నిపుణులతో కలిసి శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. "ఈ ఘటనలో కొందరు మరణించారని మేము నిర్ధారించగలం" అని డేవిస్ తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోందని, ఇది తమకు నరకంలా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో తనకు దగ్గరివారైన మూడు కుటుంబాలు ఉన్నాయని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, పరిసర ప్రాంతాల్లో ఏవైనా గుర్తుతెలియని శకలాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ ఘటనపై టెన్నెస్సీ గవర్నర్ బిల్ లీ స్పందిస్తూ, "ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. బాధిత కుటుంబాల కోసం ప్రార్థన చేయండి" అని ప్రజలకు పిలుపునిచ్చారు.
Tennessee Factory Explosion
Tennessee
Humphreys County
Bucksnort
Accurate Energetic Systems
ammunition factory explosion
factory explosion
Bill Lee

More Telugu News