YS Sharmila: ఆరోగ్యశ్రీపై కుట్ర జరుగుతోంది... పాత విధానంలోనే కొనసాగించాలి: షర్మిల

YS Sharmila Slams Conspiracy Against Aarogyasri Scheme
  • ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్న షర్మిల
  • ప్రైవేట్ బీమా ముసుగులో పథకాన్ని నీరుగార్చుతున్నారని విమర్శలు
  • నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.2700 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం వెనుక, పేదలకు సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేసే దురుద్దేశం దాగి ఉందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీని ఒక దైవవరంగా తీసుకొస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని నిర్వీర్యం చేస్తూ రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని షర్మిల విమర్శించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.2,700 కోట్ల బకాయిలు పేరుకుపోవడం వల్లే, ఆయా ఆసుపత్రులు సమ్మెకు దిగాయని, నెల రోజులుగా ఓపీ సేవలు నిలిచిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఇది ప్రజారోగ్యంపై ప్రభుత్వానికున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు దానిని కేవలం 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెట్టడం మోసగించడమేనని షర్మిల ఆరోపించారు. "రూ.2.5 లక్షలు దాటితే మళ్లీ ఆరోగ్యశ్రీ కింద ఇస్తామనడంలో ఆంతర్యం ఏమిటి? ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ప్రభుత్వ పథకాన్ని బలి చేస్తున్నారా?" అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.4 వేల కోట్లు కేటాయించడానికి వెనుకాడే ప్రభుత్వం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వేల కోట్లు ఎలా దోచిపెడుతుందని నిలదీశారు.

దేశంలో ప్రైవేట్ బీమాను అమలు చేసిన 18 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు తిరిగి ప్రభుత్వ ట్రస్ట్ విధానానికే మళ్లాయని షర్మిల గుర్తుచేశారు. ప్రైవేట్ బీమా వల్ల ప్రజలపై భారం తప్ప ప్రయోజనం లేదని ఆ రాష్ట్రాలు గ్రహించాయని తెలిపారు. ఇంతకాలం విజయవంతంగా నడుస్తున్న ట్రస్ట్ విధానాన్ని పక్కనపెట్టి, ప్రైవేట్ బీమాను ఎందుకు తీసుకొస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ బీమాకు అనుసంధానించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ట్రస్ట్ విధానంలోనే ఆరోగ్యశ్రీని కొనసాగించాలని కోరారు. ఆసుపత్రులకు ఉన్న రూ.2700 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి, వైద్య సేవలు పునరుద్ధరింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు.
YS Sharmila
Aarogyasri
Andhra Pradesh
Chandrababu Naidu
Health Insurance
Private Insurance
YSR
AP Congress
Healthcare Scheme
Medical Services

More Telugu News