Khammam: యూట్యూబ్ చూసి హత్య.. స్నేహితుడిని ముక్కలుగా నరికేశాడు!

Khammam Man Murders Friend After Watching YouTube Videos
  • ఖమ్మంలో స్నేహితుడి దారుణ హత్య
  • డబ్బు, బంగారం కోసమే ఈ ఘాతుకం
  • యూట్యూబ్ చూసి హత్యకు ప్లాన్ చేసిన నిందితుడు
  • తల, మొండెం వేరుచేసి పొదల్లో పడేసిన వైనం
  • ముఖ్య నిందితుడితో పాటు మరో ఇద్దరి అరెస్ట్
  • స్వలింగ సంపర్కమే పరిచయానికి కారణమని వెల్లడి
హత్య ఎలా చేయాలి? సాక్ష్యాలను ఎలా మాయం చేయాలి? అని యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న ఓ వ్యక్తి, మరో ఇద్దరితో కలిసి తన స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేశాడు. డబ్బు, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ కిరాతక హత్యకు సంబంధించిన వివరాలను ఖమ్మం ఏసీపీ తిరుపతిరెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లు (40) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కొంతకాలం క్రితం ఖమ్మం గ్రంథాలయంలో ఏపీకి చెందిన పరిమి అశోక్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్వలింగ సంపర్కానికి దారితీసింది. అడిగినప్పుడల్లా అశోక్‌కు వెంకటేశ్వర్లు డబ్బులు ఇస్తుండేవాడు. ఎం.ఫార్మసీ చదివిన అశోక్‌కు, స్థానిక ఆసుపత్రిలో పనిచేసే ఓ ఆయాతో వివాహేతర సంబంధం ఉంది. మరోవైపు, వ్యవసాయ పనుల సమయంలో బాలాపేటకు చెందిన పెంటి కృష్ణయ్యతో కూడా అశోక్‌కు పరిచయం ఉంది. ఈ ముగ్గురూ కలిసి వెంకటేశ్వర్లును హత్య చేసేందుకు పథకం వేశారు.

వెంకటేశ్వర్లు వద్ద ఉన్న డబ్బు, బంగారం కాజేయాలనే దురుద్దేశంతోనే అశోక్ ఈ హత్యకు ప్లాన్ చేశాడు. హత్య ఎలా చేయాలి, శరీరాన్ని ఎలా ముక్కలు చేయాలో యూట్యూబ్ వీడియోలు చూసి తెలుసుకున్నాడు. పథకం ప్రకారం, గత నెల 15న వెంకటేశ్వర్లు ఖమ్మంలోని అశోక్ గదికి వచ్చి నిద్రపోయాడు. సెప్టెంబర్ 16వ తేదీ తెల్లవారుజామున, నిద్రలో ఉన్న వెంకటేశ్వర్లు గొంతును అశోక్ కత్తితో కోసి చంపేశాడు.

అనంతరం, తల, మొండెం వేరు చేసి, మిగతా శరీర భాగాలను కూడా ముక్కలుగా నరికాడు. వాటిని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి, దుప్పటిలో మూటకట్టి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరి ప్రాంతంలో ఉన్న ముళ్ల పొదల్లో ఆ మూటను పడేశాడు. ఈ నెల 6వ తేదీన స్థానికులకు ఓ మనిషి పుర్రె, ఎముకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు అవి వెంకటేశ్వర్లువేనని నిర్ధారించి, లోతుగా దర్యాప్తు చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
Khammam
Gatla Venkateshwarlu
Khammam murder
YouTube murder
Parimi Ashok
Extra marital affair
Crime news Telangana
Money gold theft
Penti Krishnaiah
Body parts disposal

More Telugu News