Varinder Singh Ghuman: 'టైగర్ 3' విలన్ ఆకస్మిక మృతి.. గుండెపోటుతో బాడీబిల్డర్ కన్నుమూత

Tiger 3 Actor Varinder Singh Ghuman Dies
  • ప్రముఖ బాడీబిల్డర్, నటుడు వరీందర్ సింగ్ ఘుమన్ మృతి
  • గుండెపోటుతో 42 ఏళ్లకే ఆకస్మికంగా కన్నుమూత
  • 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న వరీందర్
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాడీబిల్డర్, నటుడు వరీందర్ సింగ్ ఘుమన్ (42) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. సల్మాన్ ఖాన్ హీరోగా 2023లో వచ్చిన 'టైగర్ 3' చిత్రంలో నటించి గుర్తింపు పొందిన ఆయన, చిన్న వయసులోనే కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరీందర్ సింగ్, అక్టోబర్ 10న సాయంత్రం 5:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాద వార్తను పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంపీ సుఖీందర్ సింగ్ రంధావా గురువారం సాయంత్రం తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

వరీందర్ సింగ్ మృతి పట్ల సుఖీందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "పంజాబ్‌కు చెందిన ప్రఖ్యాత బాడీబిల్డర్, నటుడు వరీందర్ సింగ్ ఘుమన్ అకాల మరణం వార్త విని నా హృదయం ఎంతో బాధపడింది. తన కృషి, క్రమశిక్షణతో ప్రపంచవ్యాప్తంగా పంజాబ్ కీర్తిని చాటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని పంజాబీ భాషలో పేర్కొన్నారు. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ పర్జత్ సింగ్  స్పందిస్తూ, "క్రమశిక్షణతో శరీరాన్ని నిర్మించుకున్న శాకాహారి అయిన వరీందర్ మరణం బాధాకరం" అని సంతాపం తెలిపారు.

2009లో 'మిస్టర్ ఇండియా' టైటిల్‌ను గెలుచుకున్న వరీందర్, 'మిస్టర్ ఆసియా' పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. 2012లో 'కబడ్డీ వన్స్ మోర్' అనే పంజాబీ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన, ఆ తర్వాత 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్' (2014), 'మర్జావాన్' (2019) వంటి బాలీవుడ్ చిత్రాలలోనూ నటించాడు.
Varinder Singh Ghuman
Tiger 3
Varinder Singh
bodybuilder death
heart attack
Salman Khan
Mr India
Bollywood actor
Punjabi actor
Sukjinder Singh Randhawa

More Telugu News