Kavitha: గ్రూప్-1 రగడ... ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత పోరాట ప్రకటన

Kavitha Announces Fight Against Govt Over Group 1 Issues
  • గ్రూప్-1 విషయంలో ప్రభుత్వ తప్పులు ఎండగడతామన్న కవిత
  • 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాల నిర్వహిస్తామని వెల్లడి
  • నియామకాలు రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలని డిమాండ్
తెలంగాణలో గ్రూప్-1 నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వరుస ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో గ్రూప్-1 అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 15న డివిజన్ బెంచ్ వెలువరించబోయే తీర్పు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని కవిత పేర్కొన్నారు. అందుకే, ఆ రోజు వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆమె స్పష్టం చేశారు. విద్యార్థి అమరవీరుల సాక్షిగా తమ పోరాటాన్ని నిన్ననే ప్రారంభించామని ఆమె గుర్తుచేశారు.

గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం తప్పులు చేసిందని కవిత తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాన్ని తాను శాసనమండలిలో ప్రస్తావించినప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.

ప్రస్తుతం చేపట్టిన నియామకాలను వెంటనే రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నట్లు కవిత తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ఒత్తిడితోనైనా ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని కవిత హెచ్చరించారు. అభ్యర్థులకు తమ సంస్థ ‘జాగృతి’ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.
Kavitha
MLC Kavitha
Group 1 exams Telangana
Telangana Group 1
Group 1 notification
Telangana government
BRS Party
Student issues Telangana
Telangana jobs
Jagruti

More Telugu News