Chhababai Kashinath Patil: శ్మశానంలో చోరీ... చితిలో నుంచి కపాలం ఎత్తుకెళ్లిన దొంగలు

Skull stolen from cremation pyre in Jalgaon
––
మహారాష్ట్రలోని జల్ గావ్ లో శ్మశానంలో దొంగలు పడ్డారు. చితిలో గాలించి కపాలం ఎత్తుకెళ్లారు. ముందురోజు సాయంత్రం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని ఒంటిపై ఉన్న నగలను తీయకుండానే ఖననం చేసిన విషయం తెలిసి ఈ దారుణానికి తెగబడ్డారు. తులం బంగారం కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. జల్ గావ్ కు చెందిన ఛాబాబాయి కాశీనాథ్‌ పాటిల్‌ అనే వృద్ధురాలు ఈ నెల 5న మరణించారు. కుటుంబ సభ్యులు సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

ఛాబాబాయి చివరి కోరిక మేరకు ఆమె ఒంటిపై ఉన్న నగలను అలాగే ఉంచి దహనం చేశారు. మంగళవారం ఛాబాబాయి అస్థికల కోసం వెళ్లిన బంధువులు అక్కడి పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. చితిలోని బూడిద చిందరవందరగా పడి ఉండగా.. ఎముకలు, కపాలం మాయమయ్యాయి. దీంతో ఛాబాబాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం కోసం దుండగులు ఛాబాబాయి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్లారని వారు ఆరోపించారు. శ్మశాన వాటికలో భద్రత కల్పించని మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీశారు.
Chhababai Kashinath Patil
Jalgaon
Maharashtra
Cremation
Grave robbery
Skull theft
Gold jewelry
Crime news
Old woman death

More Telugu News