Nara Lokesh: శేషగిరిరావు కుటుంబ బాధ్యత నాదే: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Assures Support to TDP Activist Seshagiri Raos Family
  • టీడీపీ కార్యకర్త శేషగిరిరావు ఫ్యామిలీతో మంత్రి లోకేశ్ భేటీ
  • ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న శేషగిరిరావు
  • కుటుంబ బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటానని హామీ
  • వైసీపీ దాడిలో గాయపడి, తర్వాత గుండెపోటుతో మృతి
  • శేషగిరిరావు పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్న మంత్రి
టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని, మనమంతా ఒకే కుటుంబమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ నేతల దాడికి గురై, ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబానికి ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబ బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో శేషగిరిరావు భార్య కృష్ణవేణి, వారి కుమారుడు, కుమార్తెతో లోకేశ్ మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. తామంతా అండగా ఉంటామని, అధైర్యపడవద్దని సూచించారు.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో అప్పటి వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న శేషగిరిరావు ఆయనను వీరోచితంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల దాడిలో ఆయన గాయపడ్డారు. కాగా, రెండు నెలల క్రితం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.

మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... "కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన శేషగిరిరావు పోరాటం మా అందరికీ స్ఫూర్తిదాయకం. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటాం. శేషగిరిరావు కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాదు, వారి బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.
Nara Lokesh
TDP
Andhra Pradesh
Namburi Seshagiri Rao
Pinnelli Ramakrishna Reddy
Macharla
Palnadu district
Political violence
TDP Activist
AP Elections 2024

More Telugu News