Vijay: బహిరంగ సభలు పెట్టావో జాగ్రత్త.. నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు

Vijay home receives bomb threat after public meetings warning
  • కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తాజా పరిణామం
  • చెన్నైలోని నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు
  • ఆగంతుకుడి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
  • కరూర్ ఘటనపై కొనసాగుతున్న న్యాయపరమైన చిక్కులు
ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం చెన్నైలో తీవ్ర కలకలం సృష్టించింది. భవిష్యత్తులో బహిరంగ సభలు నిర్వహిస్తే ఆయన ఇంటికి బాంబు పెడతామని ఓ ఆగంతుకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నీలాంగరైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

పోలీసుల కథనం ప్రకారం కన్యాకుమారి నుంచి ఓ వ్యక్తి అత్యవసర నంబర్ 100కు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవలే కరూర్‌లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషాద ఘటన నేపథ్యంలో ఈ బెదిరింపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు కరూర్ ఘటన తర్వాత విజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మృతుల కుటుంబసభ్యులకు వ్యక్తిగతంగా వీడియో కాల్స్ చేస్తూ పరామర్శిస్తున్నారు. "నేను మీకు అండగా ఉన్నాను" అని వారికి భరోసా ఇస్తూ, త్వరలోనే నేరుగా కలుస్తానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తానని కూడా ఆయన ప్రకటించారు.

అయితే, ఈ ఘటనపై విజయ్ న్యాయపరమైన చిక్కులను కూడా ఎదుర్కొంటున్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారని మద్రాస్ హైకోర్టు విమర్శించింది. ఈ ఘటనపై కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విజయ్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలని మృతులలో ఒకరైన 13 ఏళ్ల బాలుడి తండ్రి పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
Vijay
Tamil Nadu
Tamilaga Vettri Kazhagam
TVK
bomb threat
police investigation
Karur meeting
stampede
Madras High Court
CBI investigation

More Telugu News