Mohammed Shami: పుకార్లకు చెక్.. తన సెలక్షన్‌, గిల్ కెప్టెన్సీపై నోరువిప్పిన షమీ

Mohammed Shami Reacts to Selection Rumors and Gill Captaincy
  • ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన షమీ
  • జట్టు ఎంపిక తన చేతుల్లో లేదని స్పష్టం చేసిన టీమిండియా పేసర్
  • సెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ నిర్ణయమే ఫైనల్ అని వెల్లడి
  • తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టీకరణ 
  • శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయమేనని సమర్థన
  • కెప్టెన్సీ మార్పుపై ప్రశ్నలు వద్దని, అది బీసీసీఐ నిర్ణయమని వ్యాఖ్య
తనను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై వస్తున్న పుకార్లపై టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు మౌనం వీడాడు. జట్టు ఎంపిక అనేది తన చేతుల్లో లేదని, అది సెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశాడు. చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న షమీని, అక్టోబర్ 19న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానల్ వేదికగా ఆయన స్పందించాడు.

"ఆస్ట్రేలియా సిరీస్‌కు నన్ను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియాలో చాలా మీమ్స్, పుకార్లు వస్తున్నాయి. దీనిపై నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నా. జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్టర్లు, కోచ్, కెప్టెన్ చూసుకుంటారు. జట్టుకు నా అవసరం ఉందని వారు భావిస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. నేను మాత్రం ఆటకు సిద్ధంగా ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాను" అని షమీ వివరించారు.

తన ఫిట్‌నెస్‌పై కూడా షమీ పూర్తి స్పష్టత ఇచ్చాడు. "నా ఫిట్‌నెస్ చాలా బాగుంది. ఇటీవలే దులీప్ ట్రోఫీలో ఆడాను. సుమారు 35 ఓవర్లు బౌలింగ్ చేసినా చాలా సౌకర్యంగా అనిపించింది. నా రిథమ్ కూడా బాగుంది. ఫిట్‌నెస్ పరంగా ఎలాంటి సమస్యలు లేవు" అని ఆయన తెలిపారు. ఆటకు దూరంగా ఉన్నప్పుడు ప్రేరణతో ఉండటం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

అలాగే, వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను నియమించడంపై కూడా షమీ మాట్లాడాడు. "ఈ అంశంపై కూడా చాలా మీమ్స్ వస్తున్నాయి. నా దృష్టిలో దీనిపై ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. ఇది పూర్తిగా బీసీసీఐ, సెలక్టర్లు, కోచ్‌ల నిర్ణయం. గిల్‌కు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా, ఇంగ్లండ్‌లో భారత జట్టును నడిపించిన అనుభవం ఉంది. ఈ బాధ్యత ఎవరో ఒకరికి ఇవ్వాలి, బీసీసీఐ గిల్‌ను ఎంచుకుంది. మనం దానిని అంగీకరించాలి," అని షమీ అన్నారు. కెప్టెన్సీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని, ఈరోజు ఒకరు ఉంటే రేపు మరొకరు వస్తారని, దానిపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని ఆయన సూచించారు.
Mohammed Shami
Shami
Team India
Shubman Gill
BCCI
Australia series
Duleep Trophy
Indian Cricket Team Selection
Cricket fitness
Gujarat Titans

More Telugu News