Qatar Airways: ఖతార్ విమానంలో ఘోరం.. శాకాహారికి నాన్-వెజ్ వడ్డించి ప్రాణం తీశారు!

Ashoka Jayawickrama death on Qatar Airways after non veg meal served
  • ఖతార్ ఎయిర్‌వేస్‌లో శాకాహారికి మాంసాహారం వడ్డించిన సిబ్బంది
  • మాంసం పక్కన పెట్టి తినమన్న సలహాతో గొంతులో ఇరుక్కున్న ఆహారం
  • విమానంలోనే అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన 85 ఏళ్ల వృద్ధుడు
  • ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యంపై మృతుడి కుమారుడి 'రాంగ్‌ఫుల్ డెత్' దావా
  • నష్టపరిహారంగా 1.28 లక్షల డాలర్లు చెల్లించాలని డిమాండ్
ప్రముఖ విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్‌వేస్‌లో సిబ్బంది నిర్లక్ష్యం ఒక ప్రయాణికుడి ప్రాణాలను బలిగొంది. ముందుగా ఆర్డర్ చేసుకున్న శాకాహార భోజనం అందుబాటులో లేదని చెప్పి, మాంసాహార భోజనంలోని మాంసం ముక్కలు పక్కకు పెట్టి తినాలంటూ ఓ వృద్ధుడికి సలహా ఇచ్చారు. ఆ భోజనం తినే ప్రయత్నంలో ఆహారం గొంతులో ఇరుక్కుని ఆయన మరణించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబం ఎయిర్‌లైన్స్‌పై భారీ దావా వేసింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన 85 ఏళ్ల రిటైర్డ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక జయవీర, పూర్తి శాకాహారి. ఆయన 2023 జూన్ 30న లాస్ ఏంజిల్స్ నుంచి కొలంబోకు ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణించారు. 15 గంటలకు పైగా సాగే ఈ ప్రయాణం కోసం ఆయన ముందుగానే శాకాహార భోజనాన్ని ఆర్డర్ చేసుకున్నారు. అయితే, విమానంలో భోజనం వడ్డించే సమయంలో సిబ్బంది ఆయనకు వెజ్ మీల్ అందుబాటులో లేదని తెలిపారు. బదులుగా మాంసాహార భోజనాన్ని అందించి, అందులోని మాంసం ముక్కలను పక్కన పెట్టి మిగతాది తినమని సూచించారు.

సిబ్బంది చెప్పినట్లే చేసే ప్రయత్నంలో ఆహారం ఆయన గొంతులో అడ్డుపడి శ్వాస ఆడక స్పృహ కోల్పోయారు. వెంటనే విమాన సిబ్బంది స్పందించి, మెడ్‌ఎయిర్ వైద్య సలహాదారుల సూచనలతో ప్రథమ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో విమానాన్ని అత్యవసరంగా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ల్యాండ్ చేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2023 ఆగస్టు 3న ఆయన మరణించారు. శ్వాసనాళంలోకి ఆహారం వెళ్లడం వల్ల వచ్చే ‘ఆస్పిరేషన్ న్యుమోనియా’తో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై డాక్టర్ జయవీర కుమారుడు సూర్య జయవీర, ఖతార్ ఎయిర్‌వేస్‌పై 'రాంగ్‌ఫుల్ డెత్' దావా వేశారు. భోజనం అందించడంలో, వైద్య సహాయం చేయడంలో ఎయిర్‌లైన్స్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. మాంట్రియల్ కన్వెన్షన్ నిబంధనల ప్రకారం, నష్టపరిహారంగా 1,28,821 డాలర్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం, విమాన ప్రయాణంలో ప్రయాణికులకు కలిగే నష్టం లేదా మరణానికి విమానయాన సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

విమానాల్లో ప్రయాణికుల ఆహార నియమాల పట్ల ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న విధానాలపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. గతంలో కూడా ఖతార్ ఎయిర్‌వేస్‌లోనే వేరుశనగల అలర్జీ ఉన్న ఓ ప్రయాణికుడికి అలాంటి ఆహారాన్నే వడ్డించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
Qatar Airways
Ashoka Jayawickrama
vegetarian meal
wrongful death lawsuit
airline negligence
aspiration pneumonia
food allergy
international travel
medical emergency
Surya Jayawickrama

More Telugu News