Yuzvendra Chahal: పెళ్లయిన రెండో నెలలోనే మోసం.. మాజీ భార్య ఆరోపణలపై నోరువిప్పిన చాహల్

Yuzvendra Chahal Responds to Dhanashrees Allegations
  • మాజీ భార్య ధనశ్రీ ఆరోపణలపై స్పందించిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్
  • పెళ్లయిన రెండో నెలలోనే మోసం చేశాననడం అవాస్తవమని వెల్లడి
  • నా పేరు వాడుకుని ఫేమ్ కోసం ప్రయత్నిస్తోందని చాహల్ వ్యాఖ్య
  • ఆ అధ్యాయం ముగిసిపోయింది, తాను ముందుకు సాగిపోయినట్లు స్పష్టీకరణ
  • రియాలిటీ షోలో మాజీ భర్తపై ధనశ్రీ సంచలన ఆరోపణలు
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మ చేసిన తీవ్ర ఆరోపణలపై తొలిసారిగా స్పందించాడు. పెళ్లయిన రెండో నెలలోనే తాను ఆమెను మోసం చేశానంటూ ధనశ్రీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించాడు. కేవలం ఫేమ్ కోసమే ఆమె తన పేరును వాడుకుంటోందని, తన వరకు ఆ అధ్యాయం ఎప్పుడో ముగిసిపోయిందని చాహల్ స్పష్టం చేశాడు.

ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ చాహల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "నేనొక క్రీడాకారుడిని, మోసం చేసే అలవాటు నాకు లేదు. ఒకవేళ పెళ్లయిన రెండో నెలలోనే మోసం చేస్తే, ఆ బంధం ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగుతుంది? నా జీవితంలో ఆ చాప్టర్ క్లోజ్ అయింది. నేను ముందుకు సాగిపోయాను, అందరూ అదే చేస్తే మంచిది" అని అన్నాడు.

కొంతమంది ఇంకా గతాన్నే పట్టుకుని వేలాడుతున్నారని ఈ సంద‌ర్భంగా చాహ‌ల్‌ విమర్శించాడు. "నేను గతాన్ని వదిలేశాను. కానీ కొందరు ఇంకా అక్కడే ఆగిపోయారు. ఇప్పటికీ నా పేరు మీదే వాళ్ల ఇల్లు గడుస్తోంది. వాళ్లు అలాగే కొనసాగించవచ్చు. దాని గురించి నేను పట్టించుకోను, నాకు ఎలాంటి ప్రభావం లేదు. ఈ విషయంపై మాట్లాడటం ఇదే చివరిసారి అని భావిస్తున్నాను" అని చాహల్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. సోషల్ మీడియాలో వంద విషయాలు ప్రచారంలో ఉంటాయని, కానీ నిజం ఒక్కటే ఉంటుందని, అది ముఖ్యమైన వాళ్లకు తెలుసని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం తన జీవితం, ఆటపైనే పూర్తి దృష్టి సారించినట్లు చాహల్ తెలిపాడు.

అసలేం జరిగిందంటే?
ప్రస్తుతం "రైజ్ అండ్ ఫాల్" అనే రియాలిటీ షోలో పాల్గొంటున్న ధనశ్రీ వర్మ, తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి ఎప్పుడు విఫలమైందని గ్రహించారని నటి కుబ్రా సైత్ అడగ్గా, "మొదటి సంవత్సరంలోనే అర్థమైంది. పెళ్లయిన రెండో నెలలోనే అతడిని పట్టుకున్నాను" అని బదులిచ్చారు. ఇది ఆమె మాజీ భర్త చాహల్ వివాహేతర సంబంధం గురించేనని పరోక్షంగా సూచించింది.

కాగా, యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 18 నెలలుగా విడిగా ఉంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అనంతరం మార్చి 20న వీరు అధికారికంగా విడిపోయారు.
Yuzvendra Chahal
Dhanashree Verma
Chahal Dhanashree divorce
Yuzvendra Chahal cheating allegations
Dhanashree Verma allegations
Indian cricketer
Rise and Fall reality show
Bandhra Family Court
Celebrity divorce
Cricket news

More Telugu News