Hussain: రష్యా తరఫున పోరాడుతూ ఉక్రెయిన్ ఆర్మీకి చిక్కిన భారతీయుడు!

Indian youth Hussain fighting for Russia caught in Ukraine war
  • ఉన్నత చదువుల కోసం రష్యా వెళ్లి.. డ్రగ్స్ దందాలో పట్టుబడ్డ హుస్సేన్
  • జైలుకు వెళతావా లేక యుద్ధ రంగానికి వెళతావా అంటూ రష్యన్ అధికారుల బెదిరింపు
  • యుద్ధానికి వెళ్లడమే మేలని ఆయుధంతో సరిహద్దులకు చేరుకున్న హుస్సేన్
ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన భారతీయ యువకుడు ఒకరు అక్కడ డ్రగ్స్ మత్తులో కూరుకుపోయాడు. మాదకద్రవ్యాలు రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. కోర్టు అతనికి ఏడేళ్ల శిక్ష విధించడంతో జైలుకు చేరాడు. జైలు అధికారులు ఆ యువకుడికి ఒక అవకాశం ఇచ్చారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి వెళితే శిక్ష మినహాయిస్తామని, యుద్ధం ముగిశాక స్వదేశానికి తిప్పిపంపిస్తామని చెప్పడంతో ఆ యువకుడు ఆయుధం పట్టాడు. అయితే, యుద్ధ రంగంలో పోరాడుతూ ఉక్రెయిన్ దళాలకు చిక్కాడు. ఈ వివరాలను ఉక్రెయిన్ ఆర్మీ ఓ వీడియో ద్వారా వెల్లడించింది. అయితే, దీనిని భారత రాయబార కార్యాలయం ఇంకా ధ్రువీకరించలేదు. హుస్సేన్ భారతీయుడేనా కాదా అనే వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిపింది.

ఉక్రెయిన్ ఆర్మీ విడుదల చేసిన వీడియోలోని వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను తప్పించుకోవడానికి అధికారులు చెప్పినట్లు యుద్ధంలో పాల్గొనేందుకు ఒప్పుకున్నట్లు హుస్సేన్ తెలిపాడు. ఇందుకోసం అధికారులు సూచించిన కాంట్రాక్ట్ పై సంతకం చేశానని వివరించాడు. ఆపై తనను జైలు నుంచి విడుదల చేసి 16 రోజుల పాటు ఆయుధాలను ఎలా ఉపయోగించాలనే విషయంపై అధికారులు శిక్షణ ఇచ్చారని చెప్పాడు. అనంతరం తనను ఉక్రెయిన్ సరిహద్దులకు తీసుకువచ్చి వదిలివేశారని, అయితే, తాను యుద్ధం చేయలేక ఆయుధం వదిలేసి ఉక్రెయిన్ సైనికులకు లొంగిపోయానని తెలిపాడు.

రష్యాలో అంతా మోసమేనని, అవసరమైతే ఇక్కడ (ఉక్రెయిన్ లో) జైలుకైనా వెళతాను కానీ వెనక్కి తిరిగి వెళ్లనని హుస్సేన్ చెప్పాడం వీడియోలో కనిపించింది. కాగా, విదేశీయులను.. ముఖ్యంగా భారతీయులు, ఉత్తర కొరియన్లకు ఉద్యోగ అవకాశాల పేరుతో రష్యాకు రప్పించి, వారిని ఉక్రెయిన్ తో యుద్ధానికి పంపిస్తోందని రష్యాపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. తాజాగా హుస్సేన్ ఉదంతం ఈ ఆరోపణలకు ఊతమిస్తోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
Hussain
Russia Ukraine war
Indian in Ukraine
Russia army
Drug case
Ukraine army
Indian Embassy
Foreign fighters
Recruitment scam
Prison contract

More Telugu News