Naga Chaitanya: ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌తో మా ప్రేమ మొదలైంది: శోభిత గురించి చైతూ కామెంట్స్

Naga Chaitanya talks about Shobhita Dhulipala their Instagram love story
  • జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షోలో ఆసక్తికర విషయాల వెల్లడి
  • శోభిత తన బలం, మద్దతు అంటూ చైతూ ప్రశంసలు
  • తన భార్య లేకుండా ఉండలేనని వ్యాఖ్య
నటుడు అక్కినేని నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. తాజాగా వారి ప్రేమ ప్రయాణం గురించి చైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోలో పాల్గొన్న చైతన్య, తన భార్య శోభితతో పరిచయం ఎలా జరిగిందో సరదాగా వివరించారు.

తమ ప్రేమకథకు సోషల్ మీడియానే వేదికైందని చైతన్య తెలిపారు. “నా భార్యను మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో కలుస్తానని అస్సలు ఊహించలేదు. ఆమె వర్క్ నాకు బాగా తెలుసు. ఒకసారి నేను నా క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టినప్పుడు, ఆమె ఒక ఎమోజీతో కామెంట్ చేసింది. అక్కడి నుంచే మా మధ్య చాటింగ్ మొదలైంది. ఆ తర్వాత మేమిద్దరం కలుసుకున్నాం” అంటూ నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.

తన జీవితంలో శోభిత ప్రాధాన్యతను వివరిస్తూ, “శోభిత నా భార్య... ఆమె నా అతిపెద్ద బలం, మద్దతు. ఆమె లేకుండా నేను ఉండలేను” అని చైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్న ఆయన, వృత్తిపరంగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే, నాగ చైతన్య ప్రస్తుతం ‘విరూపాక్ష’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో ఒక హారర్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా, 2026లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
Naga Chaitanya
Shobhita Dhulipala
Akkineni Naga Chaitanya
Jayammmu Nischayammura
Instagram chat
Love story
Telugu cinema
Karthik Varma Dandu
Horror thriller
cloud kitchen

More Telugu News