Mahesh Babu: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్‌ బాబు కొత్త మల్టీప్లెక్స్.. 2026 సంక్రాంతికి ప్రారంభం!

Mahesh Babus New Multiplex at RTC Cross Roads Launching for Sankranti 2026
  • హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీ సినిమాస్ కొత్త మల్టీప్లెక్స్
  • మహేశ్‌ బాబు, ఏషియన్ సినిమాస్ సంయుక్త నిర్మాణం
  • 2026 సంక్రాంతికి ప్రారంభించడమే లక్ష్యం
  • అత్యాధునిక టెక్నాలజీతో 7 భారీ స్క్రీన్ల ఏర్పాటు
  • తుది దశకు చేరుకున్న నిర్మాణ పనులు
సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు, ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి అందిస్తున్న ఏఎంబీ సినిమాస్ బ్రాండ్ ఇప్పుడు హైదరాబాద్ సినిమా అభిమానులకు మరింత చేరువకానుంది. గచ్చిబౌలిలో విజయవంతమైన తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, తెలుగు సినిమాలకు గుండెకాయ లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. ఏఎంబీ సినిమాస్-ఫేజ్ 2గా వస్తున్న ఈ థియేటర్ నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ మల్టీప్లెక్స్‌ను 2026 సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మహేశ్‌ బాబు టీమ్, ఏషియన్ సినిమాస్ బృందం పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 7 స్క్రీన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్‌లో ప్రతి ఒక్కటీ అత్యుత్తమ వీక్షణ అనుభూతిని అందించేలా తీర్చిదిద్దుతున్నారు. అత్యాధునిక ప్రాజెక్షన్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన ప్రీమియం సీటింగ్‌తో గచ్చిబౌలి ఏఎంబీని మించిన స్థాయిలో దీనిని నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంపై టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లోని "మన శంకర వరప్రసాద్ గారు" సినిమాతోనే ఈ థియేటర్‌లో మొదటి షో పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి కీలకమైన ప్రాంతంలో ఇంతటి ప్రతిష్ఠాత్మక మల్టీప్లెక్స్ రావడం పట్ల సినీ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. పండుగ సీజన్‌లో ఒక్క సినిమా ద్వారానే దాదాపు 30-40 షోలతో కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ కొత్త మల్టీప్లెక్స్ రాకతో ఆ ప్రాంతంలోని ఇతర థియేటర్లకు గట్టి పోటీ తప్పదని స్పష్టమవుతోంది.
Mahesh Babu
AMB Cinemas
RTC Cross Roads
Asian Cinemas
Manashankara Varaprasad Garu
Chiranjeevi
Anil Ravipudi
Multiplex
Hyderabad
Tollywood

More Telugu News