Raghunandan Rao: కాంగ్రెస్ నేతలు ఓటర్ కార్డులు పంచుతున్నారు: ఈసీకి ఎంపీ రఘునందన్ ఫిర్యాదు

Raghunandan Rao Alleges Congress Distributing Voter ID Cards
  • జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులను పంచుతున్నారన్న రఘునందన్ రావు
  • ఈసీ వద్ద ఉండాల్సిన కార్డులు పార్టీ నేతల చేతికెలా వెళ్లాయని ప్రశ్న
  • ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు
  • ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాంగ్రెస్ నాయకులు ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ చేస్తున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు ఏకంగా ఓ దుకాణం పెట్టి మరీ ఓటర్ కార్డులు పంచుతున్నారని, ఈ విషయంపై తాను ఎన్నికల కమిషన్‌కు (ఈసీ) ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ వ్యవహారంపై పలు కీలక ప్రశ్నలు సంధించారు.

వాస్తవానికి ఎన్నికల కమిషన్ అధికారుల ద్వారా ప్రజలకు చేరాల్సిన ఓటర్ కార్డులు, కాంగ్రెస్ నాయకుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ కార్డుల పంపిణీ జరుగుతున్నా ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులు పంచుతున్న కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎలా అర్హుడవుతారని రఘునందన్ మండిపడ్డారు. "నవీన్ యాదవ్‌కు ఆ ఓటర్ ఐడీ కార్డులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారా? లేక ఎన్నికల కమిషన్ అందించిందా?" అని ఆయన ప్రశ్నించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపడతామంటే ఓట్ల చోరీ అంటూ గగ్గోలు పెట్టే మేధావులు, ఇప్పుడు జరుగుతున్న ఈ ఐడీ కార్డుల చోరీపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
Raghunandan Rao
Congress
voter ID cards
Jubilee Hills
election commission
Naveen Yadav
GHMC
Telangana elections
voter fraud

More Telugu News