Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర లేకుండా స్వర్ణాంధ్ర లేదు: సీఎం చంద్రబాబు

Chandrababu Slams Previous Government on Waste Management
  • విజయవాడలో స్వచ్ఛత అవార్డుల కార్యక్రమం
  • పారిశుద్ధ్య కార్మికులే అసలైన వీరులన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • రాష్ట్రంలో చెత్త పన్నును రద్దు చేశామని స్పష్టం చేసిన సీఎం
  • వచ్చే జనవరి 1 నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం
  • గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మిగిల్చిపోయిందని విమర్శ
  • తిరుమల పవిత్రతను కూడా గత పాలకులు దెబ్బతీశారని ఆరోపణ
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఏరివేసే సైనికులకు, సమాజంలో అపరిశుభ్రతను తరిమికొట్టే పారిశుద్ధ్య కార్మికులకు తేడా లేదని, వారిద్దరూ అసలైన వీరులని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. మన ఇల్లు, మన వీధులను నిత్యం శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న స్వచ్ఛ సేవకులకు ఆయన వందనం సమర్పించారు. విజయవాడలో జరిగిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 'జై స్వచ్ఛ సేవక్' అంటూ నినాదాలు చేస్తూ సభికులతోనూ జై కొట్టించారు. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని, వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వంపై ఈ సందర్భంగా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. స్వచ్ఛ భారత్ కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినా, గత పాలకులు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా మిగిల్చి వెళ్లారని, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారని విమర్శించారు. 

"గత ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసింది, కానీ చెత్తను మాత్రం వదిలేసింది. మేము అధికారంలోకి రాగానే చెత్త పన్నును రద్దు చేశాం, ఇప్పుడు రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను కూడా తొలగిస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. వేస్ట్ తొలగింపులో కీలక పాత్ర పోషించిన మంత్రి నారాయణను, మున్సిపల్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్రాన్ని పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 'జీరో వేస్ట్' (శూన్య వ్యర్థ) రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందులో భాగంగా త్వరలోనే 100 'స్వచ్ఛ రథాలను' అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రతి కార్యాలయం, ప్రతి రహదారి పరిశుభ్రంగా కనిపించాలని, స్వచ్ఛమైన, పచ్చనైన, ఆరోగ్యకరమైన రాష్ట్ర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. 'స్వచ్ఛాంధ్ర ప్రదేశ్' సాధించకుండా 'స్వర్ణాంధ్ర ప్రదేశ్' సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు.

గతంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సింగపూర్ మోడల్‌ను అధ్యయనం చేసి రాత్రిపూట క్లీనింగ్ విధానాన్ని అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు 'గ్రీన్ పాస్‌పోర్టు' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. 'వాడి పడేయడం' (యూజ్ అండ్ త్రో) విధానానికి స్వస్తి పలికి, 'వాడకం - పునరుద్ధరణ - పునర్వినియోగం' (యూజ్ - రికవర్ - రీయూజ్) విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ విధానాలతోనే సుస్థిరమైన స్వచ్ఛ సమాజం సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Swachh Bharat
waste management
zero waste
cleanliness drive
municipal workers
Tirumala
Swachh Andhra Pradesh
garbage tax

More Telugu News