YS Sharmila: కురుపాం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలి: షర్మిల

YS Sharmila Demands 50 Lakhs Compensation for Kurupam Victims Families
  • గిరిజన విద్యార్థినుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న షర్మిల
  • ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని డిమాండ్
  • సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని విమర్శ
కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత నీరు తాగి ఇద్దరు విద్యార్థినులు మరణించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. మరణించిన విద్యార్థినుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని, ఈ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

పాలన వైఫల్యం కారణంగానే ముక్కుపచ్చలారని చిన్నారులను కోల్పోవాల్సి వచ్చిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘటనలో మరో 128 మంది గిరిజన విద్యార్థులు ఆసుత్రుల పాలు కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. అత్యవసర వార్డుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని కోరారు.

గిరిజన బిడ్డల సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదని షర్మిల ఆరోపించారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు గుక్కెడు మంచి నీళ్లు, బుక్కెడు అన్నం కూడా సరిగా పెట్టడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయని, వాటి పేరు చెబితేనే పిల్లలు వణికిపోయే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. గిరిజన బిడ్డలపై ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనలో ప్రభుత్వ తప్పిదాన్ని రోగాలపై నెట్టి తప్పించుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. 
YS Sharmila
Kurupam incident
Andhra Pradesh
Tribal Gurukulam
contaminated water
student deaths
government negligence
ex gratia
tribal welfare

More Telugu News