Kalvakuntla Kavitha: బెంగళూరులో తేల్చుకుని రండి: రేవంత్ రెడ్డికి కవిత డిమాండ్

Kalvakuntla Kavitha Demands Revanth Reddy Clarification on Almatti Project in Bangalore
  • అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కర్ణాటక ప్రభుత్వంతో తేల్చుకుని రావాలని సూచన
  • దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే అల్మట్టిపై గొంతు విప్పడం లేదేమని ప్రశ్న
  • ఖర్గేను ఒప్పించి.. మెప్పించి రావాలన్న కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సూచన చేశారు. అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విషయమై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చించి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. "కర్ణాటకలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లిఖార్జున ఖర్గేతో చెప్పించి అల్మట్టి ఎత్తు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి" అని ఆమె పేర్కొన్నారు.

దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే అల్మట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ అధిష్ఠానమే పెద్ద దిక్కు అని ఆమె గుర్తు చేశారు.

మల్లిఖార్జున ఖర్గేను పరామర్శించి రాజకీయాలు మాట్లాడేందుకు కర్ణాటకలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డికి ఆమె ఒక విజ్ఞప్తి చేశారు. సొంత జిల్లాతో సహా దక్షిణ తెలంగాణకు సాగునీరు అందకుండా చేసే అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై బెంగళూరులోనే ఒక స్పష్టమైన హామీ తీసుకొని తెలంగాణకు తిరిగి రావాలని ఆమె హితవు పలికారు.

మల్లికార్జున ఖర్గేను ఒప్పించి, మెప్పించి ఆయన ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రికి అల్మట్టి ప్రాజెక్టుపై స్పష్టమైన సూచనలు వచ్చేలా చూడాలని కోరారు. అల్మట్టి ఎత్తు తగ్గింపుపై స్పష్టమైన ప్రకటనతోనే రేవంత్ రెడ్డి తెలంగాణలో అడుగు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha
Revanth Reddy
Almatti Project
Telangana
Karnataka
Mallikarjun Kharge

More Telugu News