Chandrababu Naidu: విదేశాల్లో చదవాలనుకునేవారికి శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces Good News for Students Studying Abroad
  • విదేశీ విద్యకు పావలా వడ్డీకే రుణాలు అందించేందుకు కొత్త పథకం
  • ప్రభుత్వమే గ్యారంటీ.. 14 ఏళ్లలో చెల్లించే వెసులుబాటు
  • రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని నిర్ణయం
  • ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ అమలు బాధ్యత సంక్షేమ శాఖలకే
  • కులవృత్తుల ఆధునికీకరణకు పెద్దపీట.. ఆధునిక పనిముట్లు పంపిణీ
  • గత సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1700 కోట్లు
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త అందించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనే కలను నిజం చేసేందుకు, పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించే సరికొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఎంతమంది విద్యార్థులైనా, ఎలాంటి పరిమితులు లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దేశంలోని ఐఐటీ, ఐఐఎం, నీట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ సంక్షేమ శాఖలపై మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, ఫరూఖ్, సవిత, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశీ విద్యా రుణాలకు 4 శాతం వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చూడాలని, దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందని హామీ ఇచ్చారు. తీసుకున్న రుణాన్ని 14 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని భావిస్తున్నారు.

హాస్టళ్ల రూపురేఖలు మార్పు

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లను పూర్తిస్థాయి రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలన్నదే తన సంకల్పమని, హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరిచి, ఏడాదిలోగా మరమ్మతులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గురుకులాల్లో పరిశుభ్రతకు, విద్యార్థుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో సౌర విద్యుత్ ఏర్పాటు చేసి, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని సూచించారు.

గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ.1,700 కోట్లను విడుదల చేయకపోవడంతో, విద్యార్థులే రూ.900 కోట్లు చెల్లించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా కాలేజీ యాజమాన్యాలకు రూ.800 కోట్లు బకాయిలు ఉన్నాయని వివరించారు.

ఆర్థిక సాధికారతే లక్ష్యం

సంక్షేమ శాఖలు ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్’ విధానాన్ని అమలు చేసే బాధ్యతను తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ లక్ష్యం నెరవేరితే ఆయా వర్గాలు ఆర్థికంగా బలపడతాయని అన్నారు. కులవృత్తుల్లో ఆధునీకరణ తీసుకురావడం ద్వారానే ఆయా వర్గాలు అధిక ఆదాయం పొందగలవని చెప్పారు. ఆదరణ-3 పథకం కింద ఇచ్చే పనిముట్లు ఆధునికంగా, ఉపయోగకరంగా ఉండాలన్నారు. 

రజకులకు గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు, సబ్సిడీ సిలిండర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మత్స్యకారులు సీవీడ్ వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. నెల్లూరు, ఏలూరు, కర్నూలులో బీసీ భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
foreign education
student loans
subsidized loans
higher education
SC ST BC welfare
fee reimbursement
residential schools
entrepreneurship

More Telugu News