Teenmar Mallanna: నాలుగు కోట్ల మందిని నియంత్రించే శక్తి ఉన్న రేవంత్ రెడ్డి... ఇద్దరిని ఆపలేరా?: తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna Allegations Against Revanth Reddy on BC Reservations
  • బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ల వెనుక రేవంత్ ఉన్నారన్న తీన్మార్ మల్లన్న
  • అదంతా రేవంత్ ఆడిస్తున్న నాటకమని మండిపాటు
  • రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే... మరో ఉద్యమం తప్పదని హెచ్చరిక
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. ఇది వందకు వంద శాతం నిజమని, బీసీలను మోసం చేసేందుకే ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు.

తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ, "రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలను నియంత్రించగలిగే శక్తి ఉన్న ముఖ్యమంత్రి... రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులను ఆపలేరా?" అని సూటిగా ప్రశ్నించారు. 70 ఏళ్లుగా బీసీలకు దక్కుతున్న హక్కులను అడ్డుకోవద్దని ఆ ఇద్దరినీ సీఎం ఎందుకు ఒప్పించలేకపోతున్నారని నిలదీశారు. "రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చేది రెడ్డి ముఖ్యమంత్రి అయితే, దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకు వెళ్లేదీ రెడ్లే ఆ కేసుల్లో వాదించే న్యాయవాదులు కూడా రెడ్లే" అంటూ మల్లన్న ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం బీసీలను ఆశల పల్లకిలో ఊగిస్తోందని మల్లన్న విమర్శించారు. హైకోర్టులో ఈ నెల 8న విచారణ జరపాల్సిన న్యాయమూర్తి మరుసటి రోజే పదవీ విరమణ చేయబోతున్నారని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం బీసీలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. తమిళనాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఒప్పించి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్పించిన విధంగా, తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే, తెలంగాణలో సరికొత్త తిరుగుబాటు తప్పదని మల్లన్న హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మంత్రులను, అధికారులను ఢిల్లీకి పంపే బదులు, పిటిషన్లు వేసిన వారిని ఆపితే సమస్య పరిష్కారమవుతుందని ఆయన సూచించారు. బీసీల పొట్ట కొట్టేలా రిజర్వేషన్లను అడ్డుకోవద్దని పిటిషనర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. 
Teenmar Mallanna
Revanth Reddy
BC Reservations
Telangana
TRP Party
High Court
Supreme Court
BC Politics
Telangana Politics
Reservation Petition

More Telugu News