Nara Lokesh: ముంబైలో ట్రాఫిగురా సీఈవో సచిన్ గుప్తాతో మంత్రి నారా లోకేశ్ భేటీ!

Nara Lokesh Meets Trafigura CEO Sachin Gupta in Mumbai
  • ముంబై పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్
  • ట్రాఫిగురా సీఈవోకు ఏపీలో ఉన్న అవకాశాలను వివరించిన లోకేశ్
  • వివిధ అంశాలపై విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రపంచ వాణిజ్య దిగ్గజ సంస్థ ట్రాఫిగురాను ఆహ్వానించారు. నారా లోకేశ్ ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన లాజిస్టిక్స్, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పేరెన్నికగన్న ట్రాఫిగురా ఇండియా (Trafigura India) సీఈవో సచిన్ గుప్తాతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలోని అవకాశాలను వివరించారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో 243.2 బిలియన్ డాలర్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన ట్రాఫిగురా... ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తో 1.4 బిలియన్ డాలర్ల విలువైన ఎల్‌ఎన్‌జీ సరఫరా ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు, జింక్, అల్యూమినియం వంటి వస్తువులను ఎగుమతి చేస్తోంది. ట్రాఫిగురా సంస్థ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా, మెటల్, మినరల్స్, బల్క్ కమాడిటీస్ రవాణా, గ్యాస్, పవర్, రెన్యువబుల్ ఎనర్జీ, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

ట్రాఫిగురా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కోల్డ్ స్టోరేజి, ఎగుమతి మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. భారత్ లో ఏపీ ప్రధాన బియ్యం ఉత్పత్తిదారు మాత్రమే కాకుండా, దేశంమొత్తం మీద 70 శాతం రొయ్యలు ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ పోర్టుల్లో సరుకు నిల్వలకు అధునాతన వేర్ హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ట్రాఫిగురా వర్గాలను కోరారు.

పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకుపోతున్న ఏపీలో విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామ్యం వహించాలని, కాకినాడ లేదా విశాఖపట్నంలో ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్‌ను ఏర్పాటుచేసి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందించాలని కోరారు. విశాఖపట్నం పోర్టు నుంచి ఈ ఏడాది 82.62 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదైన నేపథ్యంలో... విశాఖలో కమోడిటీ ట్రేడింగ్ డెస్క్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేశ్ విజ్ఞప్తిచేశారు.
Nara Lokesh
Trafigura
Sachin Gupta
Andhra Pradesh
AP Investment
Port Infrastructure
Visakhapatnam Port
Kakinada Port
LNG Terminal
Renewable Energy

More Telugu News