థ్రిల్లర్ జోనర్లో మలయాళంలో రూపొందిన సినిమానే 'చెక్ మేట్'. అనూప్ మేనన్ .. రేఖ హరింద్రన్ .. లాల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, క్రితం ఏడాది ఆగస్టు 8వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కొన్ని కారణాల వలన చాలా ఆలస్యంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ నెల 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: ఫిలిప్ కురియన్ (అనూప్ మీనన్) ఓ ఫార్మా సంస్థను నడుపుతుంటాడు. మొదటి నుంచి కూడా అతను అనేక నేరాలు చేస్తూ ఎదుగుతూ వస్తాడు. తన దారికి ఎవరు ఎదురొచ్చినా చదరంగంలో మాదిరిగా 'చెక్' పెట్టడం అతనికి అలవాటు. అతని సంస్థ తయారు చేసే డ్రగ్ కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది అనారోగ్యాలకు గురై ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు. 

అయితే డబ్బు .. పలుకుబడి కారణంగా ఆ వివాదాలు అతని గేటు బయటే ఆగిపోతూ ఉంటాయి. ఎవరైనా గొడవచేయడానికి ప్రయత్నిస్తే, తెలివిగా ఆ గొడవను అణచేస్తూ ఉంటారు. అలాంటి ఫిలిప్ ను అంజలి (అంజలి మోహనన్) నిజాయితీ టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఫిలిప్ తన దగ్గర పనిచేసే 'ఎన్నా'తో లవ్ లో ఉంటాడు. అతనికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆమెనే దగ్గరుండి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో జెస్సీ (రేఖ హరింద్రన్) ఫిలిప్ కి చేరువవుతుంది. అతను పూర్తిగా ఆమె ఆకర్షణలో పడిపోతాడు. 

జెస్సీకి ఫిలిప్ దగ్గర కావడాన్ని ఎన్నా భరించలేకపోతుంది. అలాగే గతంలో జెస్సీతో ప్రేమలో ఉన్న వినయ్ ( విశ్వం నాయర్) కూడా ఆమె చేసిన మోసానికి కోపంతో రగిలిపోతుంటాడు. ఫిలిప్ పై కోపంతో ఎన్నా ఏం చేస్తుంది? జెస్సీ పై ద్వేషంతో వినయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అసలు జెస్సీ నేపథ్యం ఏమిటి? వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది కథ.

విశ్లేషణ: ఫార్మా కంపెనీలు .. క్లినికల్ ట్రైల్స్ .. ప్రజల అనారోగ్యం .. బాధితుల ఆవేదన ..ఎదురు తిరిగినవారిని గల్లంతు చేయడం .. ఈ తరహా కథాంశంతో గతంలో చాలానే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమా కూడా అదే విధమైన అంశాన్ని టచ్ చేస్తూ నిదానంగా మొదలవుతుంది. మలయాళ సినిమాలు చాలావరకూ నిదానంగానే మొదలవుతాయి.ఆ తరువాత కథ చిక్కబడుతూ వెళుతుందని అంతా అనుకుంటారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగదు.

డ్రగ్ మాఫియా చుట్టూ ఈ కథ తిరుగుతుందనీ, ఈ అరాచకాన్ని ఆపడానికి హీరోగానీ .. మరేదైనా కీలకమైన పాత్రగాని వస్తుందని అంతా అనుకుంటారు. కానీ అసలు కథాంశాన్ని పక్కన పెట్టడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఈ కథ మోసాలు .. అక్రమ సంబంధాల చుట్టూ తిరుగుతూ, ముందుగా ఎత్తుకున్న కథను ప్రేక్షకులు మరిచిపోయేలా చేస్తుంది. పోనీ ఆ తరువాత ఎత్తుకున్న కథలో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అదీ రొటీన్ గానే సాగుతుంది. 

దర్శకుడు ఈ కథ ద్వారా ఏం చెప్పదలచుకున్నాడనే విషయం మనకి అర్థం కాదు. సబ్ ట్రాక్ లలో కనిపించే కదలిక కూడా మెయిన్ ట్రాక్ లో కనిపించదు. ఎక్కడ ఎలాంటి ట్విస్టులు లేకుండా కథ అలా నిదానంగా.. నింపాదిగా సాగుతూ ఉంటుంది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ ఉంటుంది. బలహీనమైన కంటెంట్ తో నడిచే ఈ కథను ఫాలో కావడం ప్రేక్షకులకు నిరాశగా .. నీరసంగా అనిపించకమానదు. 

పనితీరు: ఈ సినిమా టైటిల్ 'చెక్ మేట్'. దాంతో చదరంగంలో మాదిరిగా ఈ కథలో ఎత్తులు పై ఎత్తులు .. వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు ఉంటాయని ఆడియన్స్ అనుకుంటారు. అందుకు సంబంధించిన సన్నివేశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని భావిస్తారు. కానీ సినిమా చూసిన తరువాత ఈ టైటిల్ ఎందుకు పెట్టారబ్బా? అనే ఆలోచన చేయకుండా మాత్రం ఉండరు. ప్రధానమైన పాత్రలు ఓ నాలుగైదు కనిపిస్తాయి. అయితే ఆ పాత్రలలో వాళ్ల నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.     

ముగింపు: ఈ కథను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకుని వెళ్లారు. అయితే ఈ ప్రయాణంలో అసలు కథను పక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తుంది. కథానాయకుడు వేలకోట్ల బిజినెస్ కి సంబంధించిన విషయాలను పక్కన పెట్టి సిల్లీ విషయాలకి ప్రాధాన్యతను ఇవ్వడం, ఆ అంశాల చుట్టూ కథ తిరుగడం బోర్ కొట్టిస్తుంది.