Carl Erickson: చిన్నప్పుడు స్కూల్‌లో ఏడిపించాడని... 73 ఏళ్ల వయసులో స్నేహితుడి హత్య

Carl Erickson Kills Classmate After 50 Years Over School Bullying
  • 50 ఏళ్ల కిందటి పగతో మాజీ క్లాస్‌మేట్‌ను హత్య చేసిన వృద్ధుడు
  • అమెరికాలోని సౌత్ డకోటాలో 73 ఏళ్ల కార్ల్ ఎరిక్సన్ దారుణం
  • స్కూల్ లాకర్ రూంలో జరిగిన అవమానమే హత్యకు కారణం
కొన్ని అవమానాలు మనుషులను ఎంతగా వెంటాడతాయో చెప్పడానికి ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనం. పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన ఓ చిన్న అవమానాన్ని ఏకంగా 50 ఏళ్ల పాటు మనసులో పెట్టుకుని, 73 ఏళ్ల వయసులో తన మాజీ క్లాస్‌మేట్‌ను దారుణంగా హత్యచేశాడో వ్యక్తి. అమెరికాలోని సౌత్ డకోటాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కార్ల్ ఎరిక్సన్ (73) అనే వ్యక్తి తన మాజీ క్లాస్‌మేట్ అయిన నార్మన్ జాన్సన్‌ను ఇటీవల ముఖంపై రెండుసార్లు కాల్చి చంపాడు. ఈ హత్యకు కారణం ఏంటని ఆరా తీయగా, 50 ఏళ్ల కిందట హైస్కూల్ లాకర్ రూంలో జాన్సన్ తనను అవమానించాడని ఎరిక్సన్ పోలీసులకు తెలిపాడు. ఆ రోజుల్లో జాన్సన్ స్కూల్ స్పోర్ట్స్ స్టార్ కాగా, ఎరిక్సన్ స్పోర్ట్స్ టీమ్‌కు మేనేజర్‌గా ఉండేవాడు. లాకర్ రూంలో జాన్సన్ సరదాకి ఎరిక్సన్ తలపై ఓ అండర్‌వేర్ స్ట్రాప్ వేశాడని, ఆ సంఘటన తన మనసులో బలంగా నాటుకుపోయిందని ఎరిక్సన్ కోర్టుకు వివరించాడు.

"ఆ సంఘటన నా జీవితంలో తీవ్రమైన కుంగుబాటుకు కారణమైంది. అది నా అంతరాత్మలో 50 ఏళ్లుగా ఉంది" అని ఎరిక్సన్ మే నెలలో జరిగిన విచారణలో జడ్జికి తెలిపారు. కాలక్రమంలో జాన్సన్ రిటైర్డ్ టీచర్, ట్రాక్ కోచ్‌గా స్థిరపడగా, ఎరిక్సన్ వ్యాపారవేత్తగా మారాడు.

ఈ కేసులో ఫస్ట్-డిగ్రీ మర్డర్ అభియోగాలు మోపితే మరణశిక్ష పడే అవకాశం ఉండటంతో, ప్రాసిక్యూటర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఎరిక్సన్, తాను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ రెండో-డిగ్రీ హత్య నేరాన్ని అంగీకరించాడు. ఎరిక్సన్ తరఫు న్యాయవాది, సైకియాట్రిస్ట్ రాబర్ట్ గీబింక్ ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. నిందితుడు తీవ్రమైన ఆందోళన, కుంగుబాటుతో బాధపడుతున్నాడని, అతడి ఆలోచనలు అహేతుకంగా, నిర్ణయాధికారం బలహీనంగా ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

అయితే, మృతుడు జాన్సన్ కుమార్తె బెత్ మాత్రం ఎరిక్సన్ వాదనను తోసిపుచ్చారు. "అది కేవలం లాకర్ రూంలో జరిగిన ఓ చిన్న సరదా సంఘటన. మా నాన్న అంటే ఎరిక్సన్‌కు ఎప్పటినుంచో అసూయ ఉండేది" అని ఆమె ఆరోపించారు.

శిక్ష ఖరారు చేసే ముందు ఎరిక్సన్ తన చర్య పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. జాన్సన్ భార్య వైపు చూస్తూ "కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే బాగుండేది" అని ఆవేదన చెందాడు. వాదనలు విన్న కోర్టు, ఎరిక్సన్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Carl Erickson
Carl Erickson murder
Norman Johnson
South Dakota murder
School bullying
Revenge killing
Old age crime
High school incident
Mental illness defense
Second degree murder

More Telugu News