Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. సాయంత్రం 4 గంటలకు షెడ్యూల్

Bihar Assembly Elections Schedule to be Announced Today
  • నవంబర్ 22తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ గడువు
  • ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధం
  • ఛఠ్ పూజ తర్వాతే ఎన్నికలు జరపాలని పలు పార్టీల విజ్ఞప్తి
  • పోలింగ్ కేంద్రాల్లో పలు మార్పులు చేసిన ఎన్నికల సంఘం
దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఎన్నికల నగారా మోగనుంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌కు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రకటించనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.

ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుండటంతో, ఆలోపే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, అక్టోబర్ చివరిలో జరిగే ఛఠ్ పూజ పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. పండుగకు ఇతర రాష్ట్రాల నుంచి సొంత ఊళ్లకు వచ్చేవారితో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆ పార్టీలు సూచించాయి.

ఇటీవల భోజ్‌పురిలో ప్రసంగం ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ ఎన్నికల కోసం కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1,200కు పరిమితం చేశామని, బ్యాలెట్‌పై అభ్యర్థుల ఫోటోలను ఇకపై బ్లాక్ అండ్ వైట్‌లో కాకుండా కలర్‌లో ముద్రిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఛఠ్ పూజ తరహాలోనే ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన బిహార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బీహార్‌లో ఈసారి ఎన్నికల పోరు అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ), ప్రతిపక్ష ‘మహాఘట్‌బంధన్’ మధ్య జరగనుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏలో బీజేపీ (80), జేడీయూ (45), హెచ్ఏఎం-ఎస్ (4) పార్టీలు ఉన్నాయి. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌లో ఆర్జేడీ (77), కాంగ్రెస్ (19), వామపక్ష పార్టీలు (15) ఉన్నాయి. గత కొన్నేళ్లుగా నితీశ్ కుమార్ కూటములు మారడం బీహార్ రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చింది. ఈసీ షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరగనుంది.
Bihar Assembly Elections
Bihar elections
election schedule
India elections
Gyanesh Kumar
Nitish Kumar
NDA
Mahagathbandhan
Bihar politics
Chhath Puja

More Telugu News