Saiyami Kher: సినీ నటి సయామీ సాహసం.. ఏడాది తిరిగేలోపే రెండోసారి 'ఐరన్‌మ్యాన్' పూర్తి

Actress Saiyami Kher Achieves Ironman Feat Twice in a Year
  • ఇది రికార్డుల కోసం కాదని, స్వీయసవాల్ కోసమేనని వెల్లడి
  • ఈ రేసు ఒక జీవన విధానమని, పట్టుదలకు ప్రతీక అని వ్యాఖ్య
  • ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినివ్వడమే తన లక్ష్యమన్న సయామీ
  • ఐరన్‌మ్యాన్ ఇండియాకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నటి
సినీ నటి సయామీ ఖేర్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటైన 'ఐరన్‌మ్యాన్ 70.3' ట్రయాథ్లాన్‌ను ఏడాది తిరిగేలోపే రెండుసార్లు పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2024 సెప్టెంబర్‌లో మొదటిసారి, 2025 జులైలో రెండోసారి ఆమె ఈ రేసును విజయవంతంగా ముగించారు. అయితే, తాను ఈ పోటీలో పాల్గొన్నది రికార్డుల కోసం కాదని, తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసమేనని సయామీ స్పష్టం చేశారు.

ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ అంటే మాటలు కాదు. ఇందులో పాల్గొనేవారు ఒకే రోజు వరుసగా 1.9 కిలోమీటర్లు ఈత కొట్టాలి, 90 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి, ఆ తర్వాత 21.1 కిలోమీటర్లు పరుగు పెట్టాలి. ఇంతటి కఠినమైన రేసును పూర్తి చేయడానికి అసాధారణమైన శారీరక, మానసిక స్థైర్యం అవసరం.

ఈ సందర్భంగా సయామీ ఖేర్ మాట్లాడుతూ... "ఐరన్‌మ్యాన్ ఇండియాకు ప్రచారకర్తగా ఉండటం నాకు దక్కిన గౌరవం. అభిరుచి, నిలకడ, వదిలిపెట్టని పట్టుదల వంటి నేను నమ్మే విలువలన్నిటికీ ఈ ప్రయాణం ఒక ప్రతీక. ఏడాదిలో రెండుసార్లు ఈ రేసును పూర్తిచేయడం రికార్డుల కోసం కాదు, నా పరిమితులను నేను సవాలు చేసుకోవడం కోసం చేశాను" అని తెలిపారు.

"ఈత కొట్టే ప్రతిసారి, సైకిల్‌పై ఎత్తుకు వెళ్తున్నప్పుడు, పరుగులో వేసే ప్రతి అడుగు.. మనిషి శరీరం, మనసు ఎంత శక్తిమంతమైనవో నాకు గుర్తు చేశాయి. నాకు ఐరన్‌మ్యాన్ అంటే కేవలం ఒక రేసు కాదు, అదొక జీవన విధానం. క్రీడల్లో అయినా, నటనలో అయినా ఎల్లప్పుడూ నా హద్దులను చెరిపేయడానికి ప్రయత్నిస్తాను. నా ప్రయాణం మరింత మంది భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను" అని సయామీ అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే, సయామీ ఖేర్ ఇటీవల 'స్పెషల్ ఆప్స్ 2' వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో కనిపించారు. కేకే మేనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
Saiyami Kher
Ironman 70.3
triathlon
Special Ops 2
KK Menon
sports
athlete
Indian actress
fitness challenge
endurance

More Telugu News