Botsa Satyanarayana: తలదించుకుంటా.. నేరాలపై లెక్కలు తేల్చండి: ప్రభుత్వానికి బొత్స సవాల్

Botsa Satyanarayana Challenges Government on Crime Statistics
  • కూటమి ఏడాదిన్నర పాలనలోనే హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్న బొత్స
  • కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా
  • అశోక్ గజపతిరాజుకు అహంకారం ఎక్కువ అని విమర్శ
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఐదేళ్ల పాలనతో పోలిస్తే, కూటమి ఏడాదిన్నర పాలనలోనే రాష్ట్రంలో నేరాలు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, నేరాల సంఖ్యపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. "మా ఐదేళ్ల పాలన కంటే, కూటమి ఏడాదిన్నర పాలనలో తక్కువ నేరాలు జరిగాయని నిరూపిస్తే నేను తలదించుకుంటాను" అని ఆయన వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వం జగన్ ఫోబియాతో బాధపడుతోందని బొత్స ఎద్దేవా చేశారు. "ఇంకా ఎన్ని రోజులు జగన్ పేరు చెప్పుకొని బతుకుతారు?" అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, దీనికి కురుపాంలో 39 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడి ఇద్దరు మరణించడమే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం అందించే మెడికల్ కాలేజీల ఏర్పాటును ప్రైవేటీకరించడం దుర్మార్గమైన చర్య అని, పేదవాడి ఆరోగ్యం విషయంలో తమ పార్టీ రాజీపడదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజుపై బొత్స తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయనకు అహంకారం ఎక్కువని, అది ఆయన 'జెనెటిక్ ప్రాబ్లమ్' అని వ్యాఖ్యానించారు. సింహాచలంలో ఆరుగురు భక్తులు మరణిస్తే కనీసం పరామర్శించని ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. అమ్మవారి పండుగను రాజకీయం చేయడం తగదని హితవు పలికిన బొత్స... కిమిడి నాగార్జున చరిత్ర చెబితే టీడీపీనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందని వ్యాఖ్యానించారు. 
Botsa Satyanarayana
Andhra Pradesh
Crimes
YS Jagan
TDP
Ashok Gajapathi Raju
Vizag
Political criticism
Corruption
Kurupam

More Telugu News