Raghunath Goud: ప్రేమ పేరుతో వంచించిన కానిస్టేబుల్.. యువతి ఆత్మహత్య

Love and Betrayal Constable Dismissed After Woman Commits Suicide
  • కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
  • ఉద్యోగం నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటన
  • రఘునాథ్‌తో పాటు 22 మంది కుటుంబసభ్యులే కారణమంటూ బంధువుల ఆందోళన
  • గద్వాల జిల్లాలో ఘటన
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఓ కానిస్టేబుల్ కారణంగా దళిత యువతి ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్‌ను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు (డిస్మిస్) ప్రకటించారు.

కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక (32), గద్వాల జిల్లా చిన్నోనిపల్లికి చెందిన రఘునాథ్ గౌడ్ హైదరాబాద్‌లోని ఒక శిక్షణ కేంద్రంలో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ప్రియాంకను నమ్మించిన రఘునాథ్ ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. అయితే, కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చిన తర్వాత మాట మార్చి పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక జూలై 17న తొలిసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పట్లో పోలీసులు రఘునాథ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

అనంతరం ప్రియాంక.. రఘునాథ్ ఇంటికి వెళ్లి అక్కడే ఉండటం మొదలుపెట్టింది. దీంతో అతడి కుటుంబసభ్యులు తమ నివాసాన్ని మల్దకల్‌కు మార్చారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రియాంక మరోసారి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స అనంతరం డిశ్చార్జి అయింది. ఆ తర్వాత మల్దకల్‌లోని రఘునాథ్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారితో గొడవపడింది. అక్కడి నుంచి చిన్నోనిపల్లికి తిరిగివచ్చి, కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలుపుకుని తాగింది. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆమెను గద్వాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం ఆమె కన్నుమూసింది.

ప్రియాంక మృతికి కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్‌తో పాటు అతడి కుటుంబసభ్యులు 22 మంది కారణమంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ, నిందితుడైన రఘునాథ్ గౌడ్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశామని, తాజాగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నామని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Raghunath Goud
Gadwal district
Dalit woman suicide
Police constable
Love affair cheating
Suicide attempt
Dismissed from job
Priyanka suicide
Chinnoni Pally
Maldakal

More Telugu News