Rohit Sharma: ముగిసిన రోహిత్ శర్మ కెప్టెన్సీ శకం... దినేశ్ కార్తీక్ స్పందన

Rohit Sharma Era Ends Dinesh Karthik Reacts
  • రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న అభిమానులు, మాజీ ప్లేయర్లు
  • రోహిత్ పై ప్రత్యేకంగా స్పందించిన మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్
  • రోహిత్‌ను ఒక నాయకుడిగా కీర్తించిన డీకే
భారత క్రికెట్‌లో ఒక గొప్ప శకం ముగిసింది. వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ సేవలు ముగియగా, ఆ బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ స్వీకరించనున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై అభిమానులు, సహచరులు, మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (డీకే).. రోహిత్‌పై ప్రత్యేకంగా స్పందించాడు. రోహిత్‌ను ఒక నాయకుడిగా కీర్తించాడు.

డీకే భావోద్వేగపూరితంగా స్పందిస్తూ..

"రోహిత్ శర్మకు ధన్యవాదాలు. మీరు అద్భుతమైన వ్యూహకర్త. అందరితో కలిసిపోయే నాయకుడు. ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఆడేలా మానసికంగా ఎంతో భరోసా కల్పించారు. ముఖ్యంగా పెద్ద టోర్నీల్లో ఎలా గెలవాలో, ఎలా ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకోవాలో జట్టుకు నేర్పించారు" అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.

"మేము వెనక్కి తగ్గే పరిస్థితుల్లోనూ మీరు ఎప్పుడూ ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ‘ఒత్తిడి పెంచాలి, రిస్క్ తీసుకోవాలి, ట్రోఫీ వదలకూడదు’ అని మీరు చెబుతుండేవారు. ఆ భావన జట్టులో నాటుకుపోయింది. జట్టును మీరు మానసికంగా కూడా తీర్చిదిద్దారు" అని ప్రశంసించారు.

గెలిచిన విజయాలను గుర్తుచేస్తూ డీకే..

"2023 ప్రపంచ కప్ ఫైనల్ మినహా మేము ఆడిన చివరి మూడు పెద్ద టోర్నీల్లో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది. 2024 టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ముందుకెళ్లాం. అదే పోరాట పటిమతో యువ జట్టు ఆసియా కప్‌ను సైతం గెలిచింది" అని గుర్తు చేశారు.

"ఈ జట్టుకు మీరు ఇచ్చింది ఒక విజేత మనస్తత్వం. మీరు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు జట్టు ఎక్కడ ఉందో, ఇప్పుడు మీరు వెళ్లే సమయానికి మరింత మెరుగైన స్థాయిలో ఉంది. అదే ఒక గొప్ప నాయకుడికి గుర్తు" అంటూ డీకే ప్రశంసల వర్షం కురిపించాడు. 
Rohit Sharma
Dinesh Karthik
Shubman Gill
Indian Cricket
Team India
Cricket Captaincy
Cricket Team
ICC World Cup
Asia Cup
T20 World Cup

More Telugu News