UIDAI: పిల్లల ఆధార్ అప్‌డేట్‌పై గుడ్‌న్యూస్.. ఇకపై ఆ ఛార్జీలు లేవు!

Free Aadhar Biometric Update for Children Announced by UIDAI
  • పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై ఛార్జీల పూర్తి రద్దు
  • 5 నుంచి 17 ఏళ్ల లోపు వారికి ఉచితంగా అప్‌డేట్ సౌకర్యం
  • ఏడాది పాటు అమలులో ఉండనున్న కొత్త నిబంధన
  • దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది చిన్నారులకు లబ్ధి
  • తక్షణమే అప్‌డేట్ చేయించాలని తల్లిదండ్రులకు యూఐడీఏఐ సూచన
పిల్లకు ఆధార్ ఛార్జీలు రద్దు చేస్తూ, దేశవ్యాప్తంగా కోట్లాది మంది తల్లిదండ్రులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శుభవార్త అందించింది. పిల్లల కోసం తప్పనిసరిగా చేయించాల్సిన బయోమెట్రిక్ అప్‌డేట్‌ (ఎంబీయు)పై వసూలు చేస్తున్న ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 6 కోట్ల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసేటప్పుడు వారి వేలిముద్రలు, కనుపాపల వివరాలను తీసుకోరు. ఆ వయసులో అవి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే ఇందుకు కారణం. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత తొలిసారి, 15 ఏళ్లు నిండిన తర్వాత రెండోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 5-7 ఏళ్ల మధ్య, 15-17 ఏళ్ల మధ్య ఈ అప్‌డేట్ ఉచితంగా చేసేవారు. ఇతర సమయాల్లో రూ. 125 ఫీజు వసూలు చేసేవారు. తాజా నిర్ణయంతో ఇకపై 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవ పూర్తిగా ఉచితం కానుంది.

పాఠశాలల్లో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్లు, ఉపకార వేతనాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడం వంటి అనేక సేవలకు ఆధార్ తప్పనిసరి కావడంతో, బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ పిల్లల ఆధార్ వివరాలను వెంటనే అప్‌డేట్ చేయించాలని యూఐడీఏఐ అధికారులు సూచించారు.

గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన 'ఆధార్ సంవాద్' కార్యక్రమంలో ఆధార్ ద్వారా సేవల విస్తరణపై పలువురు నిపుణులు, విధాన రూపకర్తలు చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ, భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆధార్ పునాది వంటిదని, దీని ఆధారంగా ఎన్నో సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆధార్ డేటాబేస్ అత్యంత సురక్షితమైనదని ఆయన భరోసా ఇచ్చారు. యూఐడీఏఐ ఛైర్మన్ నీల్కాంత్ మిశ్రా, సీఈఓ భూవ్నేశ్ కుమార్ కూడా మాట్లాడుతూ ఆధార్ సాధికారత, విశ్వసనీయతకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
UIDAI
Aadhar update
biometric update
children Aadhar
free Aadhar update
Unique Identification Authority of India
Aadhar for children
Aadhar card
Neelkanth Mishra
Bhuvanesh Kumar

More Telugu News