Ukraine: ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి

Ukraine Passenger Train Hit by Russian Drone Attack
  • దాడి కారణంగా మంటల్లో కాలిపోయిన రైల్లోని కొన్ని బోగీలు
  • ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • రష్యాది ఉన్మాద ప్రవర్తన అంటూ జెలెన్‌స్కీ ఆగ్రహం
ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్ దాడులకు పాల్పడ్డాయి. కీవ్‌కు వెళుతున్న ప్రయాణికుల రైలుపై కూడా బాంబులు పడటంతో పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దాడి తీవ్రత, ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.

మంటల్లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. రష్యా చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడులు చేసిందని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, బహుశా ఆ దేశ ప్రజలకు ఈ విషయం తెలియకపోవచ్చని ఆయన అన్నారు.

ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రపంచం విస్మరించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. రష్యా నిత్యం ఎంతోమంది ప్రాణాలను బలిగొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం పరిష్కారం కోసం ఐరోపా, అమెరికా దేశాల నుంచి ప్రకటనలు వస్తున్నప్పటికీ, కేవలం మాటలు సరిపోవని, బలమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Ukraine
Russia
Zelensky
Ukraine war
Russian drone attack
Sumy region
Passenger train
Railway station

More Telugu News