Indians: సెక్స్ వర్కర్లను దోచుకున్న భారతీయులు.. క‌ఠిన శిక్ష విధించిన సింగ‌పూర్ కోర్టు

Two Indians Jailed For 5 Years For Robbing Sex Workers In Singapore Hotels
  • ఇద్దరు భారతీయ యువకులకు ఐదేళ్ల జైలు, 12 కొరడా దెబ్బలు విధిస్తూ కోర్టు తీర్పు
  • సెక్స్ వర్కర్లను హోటల్ గదులకు పిలిచి దాడి, దోపిడీ
  • నగదు, నగలు, మొబైల్ ఫోన్లు అపహరించిన నిందితులు
  • ఆర్థిక ఇబ్బందుల వల్లే నేరం చేశామంటూ కోర్టులో వాపోయిన యువకులు
విహారయాత్ర కోసం సింగపూర్ వెళ్లిన ఇద్దరు భారతీయ యువకులు అక్కడ దారుణానికి పాల్పడ్డారు. సెక్స్ వర్కర్లను లక్ష్యంగా చేసుకుని, వారిపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన కేసులో వారికి స్థానిక కోర్టు కఠిన శిక్ష విధించింది. నిందితులైన ఆరోక్కియసామి డైసన్ (23), రాజేంద్రన్ మయిలరసన్ (27) అనే ఇద్దరు యువకులకు ఐదేళ్ల ఒక నెల జైలు శిక్షతో పాటు, 12 కొరడా దెబ్బలు కూడా వేయాలని శుక్రవారం తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే... ఏప్రిల్ 24న విహారయాత్ర కోసం భారత్ నుంచి సింగపూర్ వెళ్లిన ఈ ఇద్దరు, రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ప్రాంతంలో ఒక అపరిచిత వ్యక్తి ద్వారా ఇద్దరు సెక్స్ వర్కర్ల ఫోన్ నంబర్లు సంపాదించారు. డబ్బు అవసరం కావడంతో వారిని దోచుకోవాలని పథకం వేశారు. ప్లాన్ ప్రకారం, ఏప్రిల్ 26న సాయంత్రం 6 గంటలకు ఒక మహిళను హోటల్ గదికి పిలిపించారు. ఆమె రాగానే బట్టలతో కాళ్లు, చేతులు కట్టేసి, చెంపపై కొట్టారు. ఆమె వద్ద ఉన్న 2,000 సింగపూర్ డాలర్ల నగదు, నగలు, పాస్‌పోర్ట్, బ్యాంక్ కార్డులను దోచుకున్నారు.

అదే రోజు రాత్రి 11 గంటలకు, మరో మహిళను వేరొక హోటల్‌కు రప్పించి దాడికి పాల్పడ్డారు. ఆమె అరవకుండా నోరు మూసి, బలవంతంగా 800 సింగపూర్ డాలర్ల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, పాస్‌పోర్ట్‌ను లాక్కున్నారు. తాము తిరిగి వచ్చేవరకు గది విడిచి వెళ్లొద్దని ఆమెను బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ దారుణం మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. రెండో బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి మరొక వ్యక్తికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు విచారణ సమయంలో నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. 

ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నేరానికి పాల్పడ్డామని, తమకు తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. "గతేడాది నా తండ్రి చనిపోయారు. నాకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇంట్లో డబ్బు లేదు, అందుకే ఇలా చేశాను" అని ఆరోక్కియసామి తెలిపాడు. "భారత్‌లో నా భార్యాబిడ్డలు ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు" అని రాజేంద్రన్ వాపోయాడు.

అయితే, నేరం తీవ్రత దృష్ట్యా న్యాయస్థానం వారికి కఠిన శిక్ష విధించింది. సింగపూర్ చట్టాల ప్రకారం, దోపిడీ సమయంలో ఉద్దేశపూర్వకంగా ఇతరులను గాయపరిచిన వారికి 5 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం 12 కొరడా దెబ్బలు విధించే అవకాశం ఉంది.
Indians
Arokiasamy Dyson
Singapore
Indian Nationals
Sex workers
Robbery
Crime
Little India
Singapore Court
Rajendran Mayilarasan

More Telugu News