Brian Bennett: టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు!

Brian Bennett hits six fours in an over sets T20 record
  • చారిత్రక రికార్డు సృష్టించిన జింబాబ్వే ఆటగాడు బ్రియన్ బెన్నెట్
  • ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాది సంచలనం
  • కెన్యాతో మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్
  • ఏడు వికెట్లతో జింబాబ్వే ఘన విజయం
  • 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు న‌మోదైంది. జింబాబ్వే యువ బ్యాటర్ బ్రియన్ బెన్నెట్, ఒకే ఓవర్లో ఆరు బంతులను బౌండరీకి తరలించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా 21 ఏళ్ల బెన్నెట్ నిలిచాడు.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా రీజనల్ ఫైనల్స్‌లో భాగంగా కెన్యాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన కెన్యా బౌలర్ లూకాస్ ఎండాసన్ బౌలింగ్‌లో బెన్నెట్ వరుసగా ఆరు ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

కేవలం 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసిన బెన్నెట్, తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తడివానషే మరుమానితో కలిసి కేవలం 38 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను తమవైపు తిప్పాడు. దీంతో జింబాబ్వే మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనకుగానూ బెన్నెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

ఈ విజయంతో జింబాబ్వే జట్టు, భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన్యా, 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో రకేప్ పటేల్ (47 బంతుల్లో 65) ఒక్కడే రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ ఫైనల్‌లో జింబాబ్వే జట్టు నమీబియాతో తలపడనుంది.
Brian Bennett
Brian Bennett Zimbabwe
Zimbabwe cricket
T20 world cup
T20 cricket record
Zimbabwe vs Kenya
Lukeas Ndandason
Tadiwanashe Marumani
ICC Mens T20 World Cup Africa Regional Finals

More Telugu News