Whooping cough: గర్భిణులూ తస్మాత్ జాగ్రత్త.. మీ చిన్నారిని కోరింత దగ్గు నుంచి కాపాడేది ఆ టీకానే!

Whooping cough can be fatal in children under age 2 Says Study
  • పసికందుల్లో ప్రాణాంతకంగా మారుతున్న కోరింత దగ్గు
  • గర్భవతులు టీకా తీసుకుంటేనే శిశువులకు రక్షణ
  • చిన్నారుల్లో లక్షణాలు వేరుగా ఉంటాయన్న తాజా అధ్యయనం
  • శ్వాస ఆగిపోవడం, తెల్ల రక్తకణాలు పెరగడం ముఖ్య లక్షణాలు
  • గర్భం దాల్చిన 27 నుంచి 36 వారాల మధ్య టీకా తప్పనిసరి
పసికందులలో సోకే కోరింత దగ్గు (పెర్టుసిస్) వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుందని, దీనిని నివారించడానికి గర్భధారణ సమయంలో తల్లులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఇది అత్యంత వేగంగా వ్యాపించే ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పెద్దలు, పిల్లల్లో ఈ దగ్గు కొన్ని నెలల పాటు తీవ్రంగా వేధిస్తుంది.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన షికాగోలోని ఆన్ & రాబర్ట్ హెచ్. లూరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటువ్యాధుల నిపుణురాలు కెయిట్లిన్ లీ కీలక విషయాలు వెల్లడించారు. "పసిపిల్లల్లో కోరింత దగ్గు లక్షణాలు పెద్దలకు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా వినిపించే 'వూప్' అనే శబ్దం వారిలో రాకపోవచ్చు. కానీ, శ్వాస అకస్మాత్తుగా ఆగిపోవడం (అప్నియా) వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి" అని ఆమె వివరించారు.

అంతేకాకుండా, ఈ ఇన్ఫెక్షన్ సోకిన పసికందులలో తెల్ల రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరిగిపోతుందని, దీనిని చూసి వైద్యులు కొన్నిసార్లు క్యాన్సర్ లేదా ఇతర జబ్బులుగా పొరబడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. పీడియాట్రిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, చిన్నారుల్లో తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరిగితే దానిని కోరింత దగ్గుగా అనుమానించాలని సూచించింది.

"పసికందులకు ఈ వ్యాధి వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, గర్భవతులుగా ఉన్నప్పుడు తల్లులు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది పుట్టబోయే బిడ్డకు ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది" అని కెయిట్లిన్ లీ తెలిపారు.

అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సైతం గర్భం దాల్చిన 27 నుంచి 36 వారాల మధ్యలో ప్రతి గర్భిణి తప్పనిసరిగా కోరింత దగ్గు టీకా తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఉపశమనం లభించడంతో పాటు, ఇతరులకు వ్యాపించకుండా అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Whooping cough
Caitlin Lee
Pertussis
Pregnancy vaccine
Infant health
Maternal immunization
CDC guidelines
Pediatrics
Bacterial infection
Respiratory illness

More Telugu News