Vladimir Putin: ఇండియా జోలికొస్తే మీకే నష్టం.. అమెరికాకు పుతిన్ హెచ్చరిక

Vladimir Putin Warns US on India Pressure
  • భారత్‌పై అమెరికా ఒత్తిడిని తీవ్రంగా విమర్శించిన రష్యా అధ్యక్షుడు  
  •  భారత్ ఎన్నటికీ తలవంచదని, అవమానాన్ని సహించదని స్పష్టీకరణ
  •  ప్రధాని మోదీ తన స్నేహితుడని, ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకోరని వ్యాఖ్య
  •  అమెరికా హెచ్చరికలకు భయపడితే భారత్‌కు 10 బిలియన్ డాలర్ల నష్టమన్న పుతిన్
  •  భారత్‌తో వాణిజ్య లోటును సరిచేస్తామని పుతిన్ హామీ
రష్యాతో ఇంధన వాణిజ్యం తగ్గించుకోవాలంటూ భారత్‌పై అమెరికా తెస్తున్న ఒత్తిడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ ఎన్నటికీ బయటి శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గదని, అలాంటి అవమానాన్ని ఎప్పటికీ సహించదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా వెనక్కి తగ్గకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే భారీ నష్టం తప్పదని గట్టిగా హెచ్చరించారు.

రష్యాలోని సోచి నగరంలో జరిగిన వాల్డాయ్ అంతర్జాతీయ చర్చా వేదికలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి భారత్ సహా 140 దేశాల నుంచి భద్రతా, భౌగోళిక రాజకీయ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ "భారత్‌తో మాకు ఎలాంటి సమస్యలు లేవు, ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నా స్నేహితుడు. ఆయన నాయకత్వంలో భారత్ ఎవరి ఒత్తిళ్లకూ లొంగదు. అమెరికా మాట విని రష్యా నుంచి ఇంధనం కొనడం ఆపేస్తే భారత్ దాదాపు 9 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నష్టపోవాల్సి వస్తుంది" అని వివరించారు.

అమెరికా చర్యలు ఆ దేశానికే నష్టం కలిగిస్తాయని పుతిన్ హెచ్చరించారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతాయని అన్నారు. ఇది అమెరికా ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి పెంచి, వడ్డీ రేట్లను అధికంగా ఉంచేలా చేస్తుందని, తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని విశ్లేషించారు.

వాణిజ్య లోటుపై హామీ
భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకోవడం వల్ల ఏర్పడిన వాణిజ్య అసమతుల్యతను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని పుతిన్ హామీ ఇచ్చారు. "భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలను అధికంగా కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నాం" అని ఆయన తెలిపారు. డిసెంబర్ నెలలో జరగనున్న తన భారత పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు.

అమెరికా ద్వంద్వ నీతిపై విమర్శ
ఇదే సమయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని పుతిన్ ఎండగట్టారు. "అణు విద్యుత్ కోసం అమెరికాకు పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం. వారికి యురేనియం సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. ఓ వైపు మా నుంచి యురేనియం కొనుగోలు చేస్తూ, మరోవైపు ఇంధన వాణిజ్యం విషయంలో భారత్‌పై ఒత్తిడి తేవడం అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనం" అని ఆయన విమర్శించారు.
Vladimir Putin
Russia
India
USA
energy trade
Narendra Modi
economic impact
US pressure
oil imports
international relations

More Telugu News