MK Stalin: చెన్నైలో హై అలెర్ట్.. సీఎం స్టాలిన్, నటి త్రిష ఇళ్లకు బెదిరింపులు!

Bomb Threats to CM Stalin and Actress Trisha in Chennai
  • కలకలం రేపిన వరుస బాంబు బెదిరింపులు
  • ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు
  • బీజేపీ రాష్ట్ర కార్యాలయం, రాజ్‌భవన్‌కు కూడా బెదిరింపు కాల్స్
  • రంగంలోకి బాంబు స్క్వాడ్.. బెదిరింపు ఉత్తదేనని తేల్చిన అధికారులు
  • ఇటీవలే నటుడు విజయ్‌ ఇంటికి కూడా ఇలాంటి బెదిరింపులు
  • నిందితుల కోసం సైబర్ క్రైమ్ పోలీసుల గాలింపు
తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఉదయం వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రముఖ నటి త్రిష సహా పలువురు ప్రముఖులే లక్ష్యంగా ఆగంతుకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.

సీఎం ఎంకే స్టాలిన్ ఆళ్వార్‌పేటలోని నివాసం, నటి త్రిష తేనాంపేటలోని ఇల్లు, టి.నగర్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతేకాకుండా రాజ్‌భవన్ (గవర్నర్ నివాసం), నటుడు, రాజకీయ నాయకుడు ఎస్వీ శేఖర్ ఇళ్లను కూడా పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చేరుకున్న భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇవన్నీ బూటకపు బెదిరింపులేనని నిర్ధారించి, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

తమిళనాడులో కొంతకాలంగా ఇలాంటి బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నీలంకరైలోని నివాసానికి కూడా ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక నటుడు ఎస్వీ శేఖర్‌కు గత వారమే ఓసారి బెదిరింపు రాగా, తాజాగా మరోసారి హెచ్చరికలు పంపడం గమనార్హం.

ఈ వరుస ఘటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఆగంతుకులు వేర్వేరు ఈ-మెయిల్ ఐడీల నుంచి బెదిరింపులకు పాల్పడుతుండటంతో వారిని గుర్తించడం సవాలుగా మారిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ, భద్రతా సిబ్బంది సమయాన్ని వృథా చేస్తున్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
MK Stalin
Tamil Nadu
Chennai
Trisha
bomb threat
BJP office
SV Shekar
Raj Bhavan
cyber crime
Tamil Vetri Kazhagam

More Telugu News