Cyclone: వాయుగుండం దెబ్బకు ఉత్తరాంధ్ర విలవిల... విశాఖలో పెనుగాలుల బీభత్సం

Deep Depression hits Uttarandhra Visakhapatnam suffers heavy damage
  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం 
  • విశాఖలో బలమైన ఈదురుగాలులకు నేలకూలిన భారీ వృక్షాలు
  • పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
  • శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరిన వరద నీరు
  • అల్లూరి జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
  • పర్యాటక ప్రాంతాల్లో అధికారుల హెచ్చరికలు, సహాయక చర్యలు ముమ్మరం
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికిపోతోంది. విశాఖపట్నం నగరంలో నేడు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో భారీ వృక్షం కూలిపోయింది. ఆ చెట్టు జీవీఎంసీ పార్కింగ్ లో ఉన్న లారీ, ఈవీ కారుపై పడింది. కార్యాలయానికి నేడు సెలవు కాగా, అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

అటు, విశాఖ ఆకాశవాణి రేడియో కేంద్రంలో మరో భారీ వృక్షం నేలకొరిగింది. ఈదురుగాలుల ధాటికి విశాఖ జీవీఎంసీ రోడ్డు, వాల్తేరు రోడ్డు, సీతమ్మ ధార, అక్కయ్యపాలెం ప్రాంతాల్లోనూ చెట్లు నేలకొరిగాయి. దాంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీవీఎంసీ, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పడిపోయిన చెట్లను యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. 

ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలు కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట, గునుపల్లిలో ఇళ్లలోకి వర్షపునీరు ప్రవేశించింది. వెంటనే స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష జిల్లా కలెక్టర్ తో మాట్లాడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇళ్లలోకి ప్రవేశించిన నీటిని తొలగించేందుకు ఫైరింజన్లు, ప్రొక్లెయిన్లు పంపాలని ఆమె అధికారులను కోరారు. 

మరోవైపు, అల్లూరి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగుతుండడంతో జనజీవనం స్తంభించింది. జి.మాడుగుల కొత్తపల్లి జలపాతం ఉద్ధృతంగా మారింది. జలపాతాల వద్దకు వెళ్దొద్దని పర్యాటకులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కల్వర్టులు, వంతెనలు, వాగులు దాటేందుకు ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేశారు. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులోనూ చెట్టు విరిగిపడ్డాయి. బొర్రా జంక్షన్ సమీపంలో చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
Cyclone
Visakhapatnam
Andhra Pradesh
GVMC
Srikakulam
Gouthu Sirisha
Alluri district
Heavy Rains
Weather
Disaster Management

More Telugu News