Tirumala Brahmotsavam: చక్రస్నానంతో ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు... శ్రీవారి హుండీ ఆదాయం రూ.25.12 కోట్లు

Tirumala Brahmotsavam Concludes with Chakra Snanam Hundi Income Reaches 2512 Crores
  • వైభవంంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • ఉత్సవాల్లో స్వామిని దర్శించుకున్న 5.80 లక్షల మంది భక్తులు
  • 28 లక్షల లడ్డూల విక్రయం
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నానాన్ని గురువారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో సుదర్శన చక్రత్తాళ్వార్‌కు పవిత్ర స్నానం చేయించగా, వేలాది మంది భక్తులు ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. దీంతో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ఉత్సవాలకు పరిసమాప్తి పలికినట్లయింది.

ఈ బ్రహ్మోత్సవాలు అసాధారణ రీతిలో విజయవంతమయ్యాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. టీటీడీ చేసిన ఏర్పాట్లపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశంసలు కురిపించారని, వారి సంతృప్తే ఈ ఉత్సవాల విజయానికి గీటురాయి అని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా మొత్తం 5.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని వెల్లడించారు. శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 25.12 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

భక్తుల సేవలోనూ టీటీడీ తన ప్రత్యేకతను చాటుకుంది. ఉత్సవాల సమయంలో ఏకంగా 26 లక్షల మంది భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందించారు. మరోవైపు, 28 లక్షలకు పైగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులు కొనుగోలు చేశారు. అలాగే, 2.42 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు ఛైర్మన్ వివరించారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున అదనంగా 45,000 మందికి దర్శన భాగ్యం కల్పించడం విశేషం.

ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సాంస్కృతికంగానూ అలరించాయి. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి వచ్చిన 298 కళాబృందాలకు చెందిన సుమారు 6,976 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. భక్తుల భద్రత కోసం 4,000 మంది పోలీసులు, 1,800 మంది విజిలెన్స్ సిబ్బందితో పాటు 3,500 మంది టీటీడీ సిబ్బంది నిరంతరం సేవలందించారు. 

వైద్య సేవలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తుల సహకారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Tirumala Brahmotsavam
Sri Venkateswara Swamy
TTD
Chakra Snanam
Tirumala Tirupati Devasthanams
BR Naidu
Hundi Income
Garuda Seva
Ladoo Prasadam
Andhra Pradesh

More Telugu News