Madhya Pradesh: పసిపిల్లల ప్రాణం తీసిన దగ్గుమందు.. మధ్యప్రదేశ్ లో ఘోరం

Cough Syrup Suspected in Madhya Pradesh Child Deaths
  • పదిహేను రోజుల్లో ఆరుగురు పిల్లలు మృత్యువాత
  • మరణాలకు కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని వెల్లడి
  • రెండు దగ్గుమందుల అమ్మకాలపై నిషేధం విధించిన కలెక్టర్
మధ్యప్రదేశ్ లో పదిహేను రోజుల వ్యవధిలో ఆరుగురు పిల్లలు మరణించారు. అందరూ ఐదేళ్లలోపు చిన్నారులే.. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగానే వారంతా చనిపోవడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు విచారణ చేపట్టారు. దగ్గు మందు వల్లే పిల్లల మరణాలు సంభవించాయని ప్రాథమికంగా తేలడంతో రెండు రకాల సిరప్ ల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే..

ఛింద్వారా జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో ఐదేళ్లలోపు బాలుడికి ఇటీవల జ్వరం వచ్చింది. చలిజ్వరంతో బాధపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యుడు జ్వరం మందుతో పాటు దగ్గు మందు కూడా రాశాడు. ఆ మందులు వాడడంతో జ్వరం తగ్గింది. కానీ బాబుకు మూత్రం రావడంలేదు. వారంలోపే మళ్లీ జ్వరం తిరగబెట్టింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుడు పెద్దాసుపత్రికి పంపించాడు. అక్కడ చికిత్స పొందుతూ బాబు చనిపోయాడు.

మూత్రపిండాల ఇన్ ఫెక్షన్ కారణంగా బాబు చనిపోయాడని వైద్యులు తెలిపారు. అయితే, గతంలో తమ బాబుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, జ్వరం, దగ్గు మందులు తాగించిన తర్వాతే మూత్రం పోయలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఇవే లక్షణాలతో పదిహేను రోజుల వ్యవధిలో మరో ఐదుగురు పిల్లలు మృత్యువాత పడ్డారు. దీంతో ఛింద్వారా కలెక్టర్ స్పందించి రెండు రకాల దగ్గు మందులను అమ్మవద్దంటూ మెడికల్ షాపులకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లల మరణాలపై విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Madhya Pradesh
cough syrup
child deaths
kidney failure
Chhindwara
medical investigation
pediatric health
India news

More Telugu News