Telangana: మహిళలపై నేరాల్లో తెలంగాణ టాప్.. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో షాకింగ్ నిజాలు

Telangana Tops in Crimes Against Women NCRB Report
  • 2023లో దేశవ్యాప్తంగా మహిళలపై 4.5 లక్షల నేరాలు
  • గత రెండేళ్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన కేసులు
  • నేరాల రేటులో దేశంలోనే తెలంగాణకు మొదటి స్థానం
  • అత్యధిక కేసులతో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్ 
  • భర్త, బంధువుల క్రూరత్వానికి బలవుతున్న మహిళలు
  •  వివరాలను వెల్లడించిన జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
భారత్‌లో మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు. 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కేసులు నమోదైనట్లు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. గత రెండేళ్లతో పోల్చితే ఈ సంఖ్య స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ ఈ నివేదికను రూపొందించింది.

నివేదిక ప్రకారం.. 2023లో మొత్తం 4,48,211 కేసులు నమోదు కాగా, 2022లో ఈ సంఖ్య 4,45,256గా, 2021లో 4,28,278గా ఉంది. దీన్నిబట్టి చూస్తే మహిళలపై నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది మహిళలకు 66.2 నేరాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ కేసుల్లో ఛార్జిషీట్ల దాఖలు రేటు 77.6 శాతంగా నమోదైంది.

మహిళలపై నేరాల రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణలో ప్రతి లక్ష మంది మహిళలకు 124.9 నేరాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో రాజస్థాన్ (114.8), ఒడిశా (112.4), హర్యానా (110.3), కేరళ (86.1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ (66,381) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర (47,101), రాజస్థాన్ (45,450), పశ్చిమ బెంగాల్ (34,691), మధ్యప్రదేశ్ (32,342) రాష్ట్రాలు నిలిచాయి.

నమోదైన కేసుల్లో అత్యధికంగా భర్త లేదా వారి బంధువుల క్రూరత్వానికి (ఐపీసీ సెక్షన్ 498ఏ) సంబంధించినవే ఉన్నాయి. ఇలాంటి కేసులు 1,33,676 నమోదు కాగా, కిడ్నాప్, అపహరణ కేసులు 88,605 ఉన్నాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో జరిగిన దాడులు 83,891 నమోదు కాగా, అత్యాచారం కేసులు 29,670గా ఉన్నాయి. వీటితో పాటు వరకట్న హత్యలు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి కేసులు కూడా గణనీయ సంఖ్యలో నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది.
Telangana
NCRB Report
Women Crime Rate India
Crime Against Women Telangana
Rape Cases India
Kidnapping Cases India
Domestic Violence India
Uttar Pradesh Crime
Rajasthan Crime
Crime Statistics India 2023

More Telugu News