Night Shift Workers: నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు కిడ్నీలో రాళ్ల ముప్పు.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

Young night shift workers more at risk of developing kidney stones Says Study
  • నైట్ షిఫ్ట్ చేసేవారిలో కిడ్నీ స్టోన్స్ ముప్పు అధికం
  • సాధారణ ఉద్యోగులతో పోలిస్తే 15 శాతం ఎక్కువ ప్రమాదం
  • ముఖ్యంగా యువత, శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారికి ప్రమాదం
  • శరీర జీవ గడియారం దెబ్బతినడమే ప్రధాన కారణం
  • ధూమపానం, నిద్రలేమి, బీఎంఐ వంటివి కూడా ప్రభావం
రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారికి, ముఖ్యంగా యువతకు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని ఓ తాజా అధ్యయనం హెచ్చరించింది. షిఫ్ట్ పద్ధతిలో పనిచేసే వారిలో, ముఖ్యంగా రాత్రి షిఫ్టులు చేసేవారిలో ఈ ముప్పు 15 శాతం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. శారీరక శ్రమ తక్కువగా ఉండే ఉద్యోగాలు చేసే యువత ఈ సమస్య బారిన పడే అవకాశాలు మరింత ఎక్కువని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వివరాలు ప్రతిష్ఠాత్మక 'మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

రాత్రివేళల్లో పనిచేయడం వల్ల శరీర జీవ గడియారం (సర్కేడియన్ రిథమ్) దెబ్బతింటుందని, ఇదే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణంగా నిలుస్తోందని అధ్యయనం పేర్కొంది. ఈ జీవ గడియారం పనితీరులో మార్పులు రావడం వల్ల జీవక్రియలు, హార్మోన్ల విడుదలలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది కిడ్నీల పనితీరుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

ఈ విషయంపై అధ్యయనానికి నేతృత్వం వహించిన చైనాలోని సన్ యాట్-సేన్ యూనివర్సిటీకి చెందిన యిన్ యాంగ్ మాట్లాడుతూ, "షిఫ్ట్ ఉద్యోగాలు కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతున్నాయని మా పరిశోధనలో తేలింది. ధూమపానం, నిద్రలేమి, తగినంతగా నీళ్లు తాగకపోవడం, అధిక శరీర బరువు (బీఎంఐ) వంటి జీవనశైలి అంశాలు కూడా ఈ ముప్పును పాక్షికంగా పెంచుతున్నాయి" అని తెలిపారు.

ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు సుమారు 2,20,000 మందికి పైగా వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని 13.7 సంవత్సరాల పాటు విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీలో రాళ్ల సమస్య సర్వసాధారణంగా మారుతోందని, దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ అధ్యయనంపై మేయో క్లినిక్‌కు చెందిన డాక్టర్ ఫెలిక్స్ నాఫ్ స్పందిస్తూ, "శరీరంలోని దాదాపు అన్ని జీవక్రియలు ఈ జీవ గడియారంపైనే ఆధారపడి ఉంటాయి. షిఫ్ట్ వర్క్ దీనిని దెబ్బతీయడం వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి" అని వివరించారు.
Night Shift Workers
Kidney Stones
Shift Work
Circadian Rhythm
Health Risks
Sleep Deprivation
Dehydration
Yin Yang
Felix Knoll
Mayo Clinic

More Telugu News