Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. తెలంగాణలో మళ్లీ కాలేజీల బంద్ సైరన్

Telangana Private Colleges Threaten Strike Over Fee Reimbursement
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీల ఆగ్రహం
  • దసరా తర్వాత కాలేజీలు తెరిచేది లేదని స్పష్టీక‌ర‌ణ‌
  • ఈ నెల‌ 6 నుంచి నిరవధిక బంద్‌కు పిలుపు
  • గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోని ప్రభుత్వం
  • భవిష్యత్ కార్యాచరణపై నేడు 'ఫతి' అత్యవసర సమావేశం
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వానికి మధ్య ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం మళ్లీ ముదిరింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, దసరా సెలవుల అనంతరం ఈ నెల‌ 6వ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల 15న బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం, యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు ముందు రూ.600 కోట్లు, దీపావళి తర్వాత మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళనను విరమించుకున్నాయి.

అయితే, ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు వారాలు గడిచిపోయినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో కాలేజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. బకాయిల గురించి ప్రస్తావించగా, ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం.

ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన యాజమాన్యాలు మళ్లీ ఆందోళన బాట పట్టాయి. దీనిపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు 'ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్' (ఫతి) ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిరవధిక బంద్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే జరిగితే, దసరా సెలవుల తర్వాత కాలేజీలు తెరుచుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
Fee Reimbursement
Bhatti Vikramarka
Telangana
private colleges
college বন্ধ
higher education
Sridhar Babu
Sandeep Kumar Sultania
FATHE
student protests

More Telugu News