China-India Ties: అమెరికా షాక్ ఇస్తుంటే.. చైనా బంపర్ ఆఫర్.. భారత ఫార్మా దశ తిరగనుందా?

China Scraps Tariffs on Indian Pharma Imports
  • భారత ఔషధాలపై దిగుమతి సుంకం ఎత్తేసిన చైనా
  • 30 శాతం పన్నును సున్నాకు తగ్గిస్తూ కీలక నిర్ణయం
  • అమెరికా సుంకాల ఒత్తిడి వేళ భారత ఫార్మాకు భారీ ఊరట
  • రెండో అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో పెరగనున్న అవకాశాలు
  • భారత ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అంటున్న నిపుణులు
భారత ఫార్మా పరిశ్రమకు భారీ ఊరటనిస్తూ చైనా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే అన్ని రకాల ఔషధాలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా వంటి దేశాలు భారత ఫార్మా ఉత్పత్తులపై కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో చైనా తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటివరకు భారత్ నుంచి వచ్చే మందులపై చైనా 30 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేసేది. ఇప్పుడు దానిని సున్నా శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో భారత ఫార్మా కంపెనీలు ఎలాంటి పన్నుల భారం లేకుండా తమ ఉత్పత్తులను నేరుగా చైనాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమమైంది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్ అయిన చైనాలో వ్యాపారం చేసేందుకు భారత కంపెనీలకు ఇన్నాళ్లూ అధిక సుంకాలు అడ్డంకిగా ఉండేవి. తాజా నిర్ణయంతో నాణ్యత, ధరల విషయంలో ఇతర దేశాల కంపెనీలతో పోటీ పడటానికి భారత ఫార్మా పరిశ్రమకు గొప్ప అవకాశం లభించింది. 'ప్రపంచ ఫార్మసీ'గా పేరుగాంచిన భారత్ నుంచి తక్కువ ధరకే లభించే జనరిక్ ఔషధాలకు చైనాలో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

చైనా తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా, ఇది వాణిజ్య సమతుల్యతను సాధించడానికి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ ఫార్మా మార్కెట్ స్వరూపంలో కూడా మార్పులు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
China-India Ties
Indian Pharma Industry
China
India
pharmaceutical exports
drug imports
trade relations
generic drugs
US
pharmaceutical market
import tariffs

More Telugu News