H-1B Visa: హెచ్‌-1బీ వీసాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు.. త్వరలో రానున్న భారీ మార్పులు!

Howard Lutnick on H1B Visa Reforms in the US
  • హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులకు సన్నాహాలు
  • అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ కీలక వ్యాఖ్యలు
  • 2026 ఫిబ్రవరి నాటికి కొత్త నిబంధనలు అమలు
  • నైపుణ్యవంతులకు లాటరీ పద్ధతి సరికాదన్న మంత్రి
  • చౌక టెక్ నిపుణుల కోసమే వీసాలు కాదంటూ అసంతృప్తి
  • టెక్కీలే కాదు.. డాక్టర్లు, విద్యావేత్తలు రావాలన్న అభిప్రాయం
భారతీయ టెక్ నిపుణులకు అత్యంత కీలకమైన హెచ్‌-1బీ వీసా విధానంలో భారీ మార్పులు రాబోతున్నాయని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత వీసా జారీ ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌, 2026 ఫిబ్రవరి లోగా ఈ వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కేవలం చౌకగా లభించే టెక్ నిపుణులను దేశంలోకి తీసుకురావడానికే ఈ వీసాలు అన్న అభిప్రాయం సరికాదని ఆయన అన్నారు.

‘న్యూస్‌నేషన్‌’ అనే మీడియా సంస్థతో మాట్లాడుతూ లుట్నిక్‌ పలు కీలక విషయాలు వెల్లడించారు. "ప్రస్తుత హెచ్‌-1బీ విధానం లోపభూయిష్టంగా ఉంది. అత్యంత నైపుణ్యం కలిగిన వారిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు. ఈ విధానాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వీసాదారులతో దేశం నిండిపోకుండా ఉండాలంటే లక్ష డాలర్ల ఫీజు విధించినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం జారీ అవుతున్న హెచ్‌-1బీ వీసాల్లో సుమారు 74 శాతం టెక్ నిపుణులకే వెళ్తున్నాయని, అయితే డాక్టర్లు, విద్యావేత్తల వంటి ఇతర కీలక రంగాల నిపుణుల వాటా కేవలం 4 శాతంగానే ఉందని లుట్నిక్‌ వివరించారు. దేశానికి ఉన్నత డిగ్రీలు కలిగిన డాక్టర్లు, విద్యా నిపుణుల అవసరం ఎక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కంపెనీలకు ఇంజనీర్లు మాత్రమే కావాలనుకుంటే, అధిక జీతాలు పొందే అత్యుత్తమ నిపుణులను మాత్రమే నియమించుకోవాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో హెచ్‌-1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం కాబోతున్నాయనడానికి సంకేతంగా నిలుస్తున్నాయి.
H-1B Visa
Howard Lutnick
US Immigration
Indian IT Professionals
H-1B Visa Reform
United States
Tech Workers
Immigration Policy
Skilled Workers
Visa Fee

More Telugu News