Chandrababu: ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి: నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu urges TDP leaders to bring government schemes into the public
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సీఎం ఆదేశం
  • గత ప్రభుత్వం ట్రూ అప్‌తో బాదితే, మేం ట్రూ డౌన్‌తో తగ్గిస్తున్నామన్న చంద్రబాబు
  • విద్యుత్ ఛార్జీల తగ్గింపు, సమర్థ నిర్వహణపై ప్రజలకు వివరించాలన్న సీఎం
  • ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని వెల్లడి
  • సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఓన్ చేసుకునేలా చూడాలని సూచన
  • కూటమి పార్టీలు మరింత బలపడాలని నేతలకు పిలుపు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమర్థ, అసమర్థ పాలన మధ్య ఉన్న తేడాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పలు కీలక అంశాలపై మాట్లాడారు.

గత ప్రభుత్వం ‘ట్రూ అప్’ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపిందని, కానీ తమ కూటమి ప్రభుత్వం ‘ట్రూ డౌన్’ పేరుతో ఛార్జీలను తగ్గిస్తోందని చంద్రబాబు తెలిపారు. పీక్ అవర్స్‌లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయకుండా, స్వాపింగ్ విధానాన్ని అనుసరించడం వల్లే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.

పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర జనాభాలో 13 శాతం మందికి తమ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పెన్షన్ల కోసం ఏటా కేవలం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రూ.33 వేల కోట్లకు పైగా పంపిణీ చేస్తోందని పోల్చి చెప్పారు. ఈ తేడాను ప్రజలు గమనించేలా చేయాలన్నారు.

"సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పి, వారు ఈ పథకాలను ఓన్ చేసుకునేలా చూడాలి. పార్టీ నేతలు, కార్యకర్తల వ్యవహార శైలి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి," అని చంద్రబాబు స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకం వంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ వైపు నిలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, కూటమికి లభించిన అద్భుత విజయాన్ని నిలబెట్టుకుంటూ పార్టీలను మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు.
Chandrababu
TDP
Telugudesam
Andhra Pradesh

More Telugu News