Tilak Varma: తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ క్రికెటర్.. సొంత జట్టుపై తీవ్ర విమర్శలు

Tilak Varma Praised by Mohammad Amir After Asia Cup Win
  • తిలక్ వర్మ స్మార్ట్ క్రికెట్ ఆడాడన్న మహ్మద్ ఆమిర్
  • తిలక్ వర్మను చూసి పాక్ బ్యాటర్లు నేర్చుకోవాలంటూ హితవు
  • పాకిస్థాన్ బ్యాటర్ల ప్రణాళిక లోపం, అవగాహన రాహిత్యంపై తీవ్ర విమర్శలు
ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్... తిలక్ ఆటతీరును ఆకాశానికెత్తడమే కాకుండా, తమ దేశ ఆటగాళ్ల వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఒత్తిడిలోనూ తిలక్ ప్రదర్శించిన పరిణతి అద్భుతమని కొనియాడాడు.

మహ్మద్ ఆమిర్ మాట్లాడుతూ, "తిలక్ వర్మకు ఆటపై అద్భుతమైన అవగాహన ఉంది. అతను చాలా స్మార్ట్‌గా క్రికెట్ ఆడాడు. పాకిస్థాన్ బ్యాటర్లు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎప్పుడు ఎలాంటి షాట్ ఆడాలో వారికి తెలియడం లేదు. తిలక్ అనవసర షాట్లకు పోకుండా, అవసరమైనప్పుడు సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. భాగస్వామ్యాలు నిర్మించాడు. మ్యాచ్ గెలవాలంటే ఇలాంటి బాధ్యతాయుతమైన ఆటతీరు అవసరం" అని విశ్లేషించాడు.

పాకిస్థాన్ జట్టు ప్రణాళిక లోపాన్ని కూడా ఆమిర్ ఎత్తిచూపాడు. "ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కచ్చితంగా గెలవాల్సింది. కానీ 2024 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఎలా ఓడిపోయామో, ఇప్పుడు కూడా అదే పునరావృతం అయింది. మా జట్టుకు సరైన ప్లానింగ్ లేదు. కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు నిలదొక్కుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించారు. వికెట్‌ను కాపాడుకోవాలన్న ఆలోచనే వాళ్లకు లేదు" అని అసహనం వ్యక్తం చేశాడు.

ఆట పరిస్థితులపై స్పందిస్తూ, "చివరి పది ఓవర్లలో పరుగులు చేయడం చాలా కష్టం. ఎందుకంటే బంతి మెత్తబడి బ్యాట్‌పైకి సరిగ్గా రాదు. అటువంటి సమయంలో క్రీజులో కుదురుకున్న బ్యాటర్ మాత్రమే పరుగులు చేయగలడు. ఈ విషయం కూడా మా ఆటగాళ్లు గ్రహించలేకపోయారు" అని ఆమిర్ అభిప్రాయపడ్డాడు.

కాగా, దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, ఒక దశలో 114/3 పరుగులతో పటిష్ఠంగా కనిపించినా, ఆ తర్వాత 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి విజేతగా నిలిచింది. 
Tilak Varma
Mohammad Amir
Asia Cup 2025
India vs Pakistan
Cricket
Pakistan Cricket Team
Batting Performance
Match Analysis
Team India
Dubai

More Telugu News