Mohsin Naqvi: భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీ, మెడల్స్ ఇస్తా.. కానీ ఓ కండిషన్: పాక్ బోర్డు చీఫ్ మెలిక

Mohsin Naqvi demands formal event for India to receive Asia Cup trophy
  • ఆసియా కప్ గెలిచినా ట్రోఫీ అందని వైనం
  • మెడల్స్ ఇచ్చేందుకు కొత్త షరతు పెట్టిన ఏసీసీ చీఫ్ నఖ్వీ
  • అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని డిమాండ్
  • ఆసియా క‌ప్ వివాదంపై నేడు దుబాయ్‌లో ఏసీసీ సమావేశం
  • విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లనున్న బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించినా, ట్రోఫీని అందుకోలేకపోయిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ గొడవకు తెరదించేందుకు బదులుగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మరో కొత్త మెలిక పెట్టారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు మెడల్స్ అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే దానికోసం ఒక 'అధికారిక కార్యక్రమం' (ఫార్మల్ ఫంక్షన్) ఏర్పాటు చేయాలని ఆయన షరతు విధించినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆయన ఆసియా కప్ నిర్వాహకులకు తెలిపారని, కానీ అలాంటి కార్యక్రమం జరిగే అవకాశాలు చాలా తక్కువని సమాచారం. దీంతో ఈ ప్రతిష్ఠంభన ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. మొహ్సిన్ నఖ్వీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. నఖ్వీ గతంలో పలుమార్లు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ విషయంలో భారత జట్టుకు బీసీసీఐ పూర్తి మద్దతు ప్రకటించింది.

దాదాపు గంటపాటు ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు లేదా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుల చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరిస్తామని టీమిండియా ప్రతిపాదించినా, నఖ్వీ అందుకు అంగీకరించలేదు. అనూహ్యంగా ఆయన వేదిక దిగి స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఏసీసీ అధికారులు కూడా ట్రోఫీని తీసుకుని ఆయన వెంటే వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో భారత ఆటగాళ్లు గాల్లోనే ఊహాజనిత ట్రోఫీని ఎత్తి సంబరాలు చేసుకోవడం, కాఫీ 'కప్పు'లతో ఫొటోలు పోస్ట్ చేయడం వైరల్ అయింది.

ప్రస్తుతం ఆ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం. ఈ వివాదాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు దుబాయ్‌లో జరగనున్న ఏసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనుంది. అలాగే నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో కూడా దీన్ని లేవనెత్తాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.
Mohsin Naqvi
Asia Cup 2024
India vs Pakistan
ACC
BCCI
Trophy Presentation
Cricket Controversy
PCB
Jay Shah
Dubai

More Telugu News