Kangana Ranaut: పరువు నష్టం కేసులో నటి కంగనాకు ఎదురుదెబ్బ.. వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశం

Kangana Ranaut setback in defamation case court orders personal appearance
  • వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పిటిషన్ తిరస్కరణ
  • అక్టోబర్ 27న కోర్టుకు రావాలని బఠిండా కోర్టు ఆదేశం
  • ఓ వృద్ధురాలిపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు
  • గతంలో సుప్రీంకోర్టులోనూ కంగనాకు చుక్కెదురు
బాలీవుడ్ ప్రముఖ  నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఎంపీ కంగనా రనౌత్‌కు పంజాబ్‌లోని బఠిండా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. అక్టోబర్ 27న జరగబోయే విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బఠిండా జిల్లాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు మహిందర్ కౌర్‌ను ఉద్దేశించి కంగనా తన ఎక్స్ (అప్పటి ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్టును రీట్వీట్ చేస్తూ వ్యాఖ్యలు జోడించారు. ఆ వృద్ధురాలిని షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొన్న బిల్కిస్ బానోగా పొరబడి, ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తన పరువుకు భంగం కలిగించారంటూ మహిందర్ కౌర్ బఠిండా కోర్టులో కంగనాపై పరువు నష్టం దావా వేశారు.

సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా కంగనా తరఫు న్యాయవాది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, ఫిర్యాదుదారు మహిందర్ కౌర్ తరఫు న్యాయవాది రఘుబీర్ సింగ్ బెనివాల్ ఈ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. కేసు ప్రారంభ దశలో నిందితులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడానికి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని వాదించారు. కంగనా కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, లేనిపక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కంగనా పిటిషన్‌ను కొట్టివేస్తూ పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కంగనా గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆమెకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సెప్టెంబర్ 12న విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కంగనా కేవలం రీట్వీట్ మాత్రమే చేయలేదని, ఉన్నదానికి "మరింత మసాలా జోడించారని" వ్యాఖ్యానించడంతో ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Kangana Ranaut
defamation case
defamation
Mahender Kaur
Farmers Protest
Bathinda Court
Punjab Haryana High Court
Supreme Court
Bilkis Bano
Bollywood

More Telugu News